దేవుడి స్క్రిప్టులో ఫుల్ స్టాప్ లేదని, కామాలు మాత్రమే ఉన్నాయని శనివారం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో సెటైర్ వేశారు. “దేవుడి స్క్రిప్ట్ లో ట్విస్ట్లూ ఉంటాయి జగన్ గారూ.. దేవుడు స్క్రిప్ట్ రాస్తూ పూర్తిగా ముగించలేదు. రాస్తూ రాస్తూ కామా పెట్టాడంతే. అది ఫుల్స్టాప్ అనుకున్నారు మీరు. ఈ గ్యాప్లోనే మీరు గుడిని, గుడిలో లింగాన్ని మింగేయాలనుకుంటున్నారు. టీడీపీ హయాంలో కరెంటు కొనుగోళ్లు అక్రమమని మీరంటే… అవి ముట్టుకుంటే షాక్ కొడతాయని కేంద్రంతో లేఖ రాయించాడు. దేవుడి స్క్రిప్టులో ఇలాంటి కామాలు చాలానే ఉంటాయి. భ్రమరావతి అన్న మీ భ్రమలు తొలగించుకునేందుకు దేవుడే ఓ ఛాన్సిచ్చాడు. సెక్రటేరియెట్లో సీఎం సీటులో కూర్చున్నప్పుడైనా, అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడైనా చంద్రబాబుకు మనసులో కృతజ్ఞతలు చెప్పుకో అని స్క్రిప్టులో మళ్లీ కామా పెట్టాడు”అని లోకేశ్ ట్వీట్ చేశారు.
