టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని శనివారం (అక్టోబర్ 7) చేపట్టింది. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి రాజమహేంద్రవరంలో పాల్గొన్నారు. భువనేశ్వరి దీపం వెలిగించి నిరసన లో పాల్గొన్నారు. ఆమెతో పాటు స్థానిక మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము సైతం బాబు కోసం, బాబుతో మేము అంటూ మహిళలు నినాదాలు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఢిల్లీలో దీపాలు వెలిగించి నిరసన తెలిపారు. సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ డెమోక్రసీ.. అంటూ నినాదాలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున కాంతితో క్రాంతి కార్యక్రమం చేపట్టడం జరిగింది. వృద్ధుల నుంచి చిన్నపిల్లల వరకు గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం అంటూ ఇళ్లలో లైట్లు ఆఫ్ చేసి కొవ్వొత్తులు, కాగడాలు, సెల్ ఫోన్ లైట్లతో నిరసన వ్యక్తం చేశారు. ఇళ్ల బయట, వాకిళ్లు, వీధుల్లో దీపాలు వెలిగించారు. రోడ్లపై వాహనాల లైట్లు బ్లింక్ చేసి తమ నిరసన తెలిపారు.
మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో కాంతితో క్రాంతి కార్యక్రమం నిర్వహించారు. గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం అంటూ సాయంత్రం 7 గంటల నుంచి 7.05 గంటల వరకు లైట్లు ఆపి కొవ్వొత్తులు, కాగడాలు, సెల్ ఫోన్ లైట్లను బ్లింక్ చేస్తూ ద్విచక్ర వాహనాలు, బైక్ లపై ఉన్నవారు తమ హెడ్ లైట్స్ ను ఆన్, ఆఫ్ చేసి నిరసన తెలిపారు.