- మంత్రి కొండా సురేఖ
అమ్రాబాద్, వెలుగు : నల్లమల ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ చెప్పారు. గురువారం శ్రీశైలం వెళ్తూ మార్గమధ్యలోని మన్ననూర్ ఫారెస్ట్ గెస్ట్ హౌజ్ వద్ద ఆగారు. స్థానిక ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, డీఎఫ్‌వో రోహిత్ గోపిడి మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ దోమలపెంట నుంచి అక్కమహాదేవి గుహలకు, సోమశిల, అమ్రగిరి వద్ద టూరిజం స్పాట్‌తో పాటు, ఆరు సఫారీ వెహికల్స్ సైతం ఏర్పాటు చేశామన్నారు. ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రపోజల్స్ పంపామని చెప్పారు.
అడవులు అభివృద్ధి చెందితేనే వన్యప్రాణుల మనుగడ సాధ్యం అవుతుందని, ఫారెస్ట్ రక్షణ అందరి భాధ్యత అన్నారు. కొత్తగా పోడు చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమ్యూనిటీ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నామని, ఎవరైనా ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున అవసరమైన కార్యాచరణ చేపడతామన్నారు.
ఫారెస్ట్ కోర్ ఏరియాలో ఉండే చెంచులను సేఫ్ జోన్‌కు తరలించి, పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆక్రమణకు గురైన అటవీ భూములను తిరిగి ఆధీనంలోకి తీసుకొని ప్లాంటేషన్ చేపడుతామన్నారు. మద్దిమడుగు వద్ద కృష్ణా నదిపై బ్రిడ్జి ఏర్పాటు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.