నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌లో.. మంద ఎంట్రీతో మారిన సీన్‌‌‌‌

  •     అనూహ్యంగా తెరమీదకు వచ్చిన మాజీ ఎంపీ మందా జగన్నాథం
  •     బీఎస్పీ నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటన
  •     ఎవరి ఓటు బ్యాంక్‌‌‌‌కు గండి పడుతుందోనని టెన్షన్‌‌‌‌

నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌, వెలుగు :  పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నిన్న, మొన్నటి వరకు కాంగ్రెస్‌‌‌‌, బీజేపీ, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మధ్యే పోరు ఉంటుందనుకున్న ఈ నియోజకవర్గ బరిలోకి మరో లీడర్‌‌‌‌ దిగడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌‌‌‌ టికెట్‌‌‌‌ ఆశించి భంగపడ్డ మాజీ ఎంపీ మందా జగన్నాథం బీఎస్పీ తరఫున బరిలోకి దిగారు. కాంగ్రెస్‌‌‌‌ గెలుపు కోసం పనిచేస్తానని ప్రకటించిన కొన్ని రోజులకే బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతిని కలిసి నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ నుంచి బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు.  

అంచనాలు తారుమారు

కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ మల్లు రవిని మినహాయిస్తే పోటీలో ఉన్న మిగతా ముగ్గురు సొంత పార్టీలను వదిలి మరో పార్టీలో చేరి టికెట్‌‌‌‌ దక్కించకున్న వారే. నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ సిట్టింగ్‌‌‌‌ ఎంపీ రాములు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ను వీడి బీజేపీలో చేరి తన కొడుకు భరత్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌కు టికెట్‌‌‌‌ సాధించుకున్నారు. పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌‌‌తో పొత్తు పెట్టుకుంటామన్న బీఎస్పీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌. ప్రవీణ్‌‌‌‌కుమార్‌‌‌‌ ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరడమే కాకుండా ఆ పార్టీ తరఫున పార్లమెంట్‌‌‌‌ బరిలో నిలిచారు. తాజాగా మాజీ ఎంపీ మందా జగన్నాథం కాంగ్రెస్‌‌‌‌ వీడి బీఎస్పీలో చేరి నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ బరిలో నిలిచారు. దీంతో ప్రధాన పార్టీల క్యాండిడేట్ల అంచనాలు తారుమారయ్యాయి. తమకు అనుకూలంగా ఉండే వర్గాల ఓట్లను మంద ఎంతవరకు ప్రభావితం చేస్తారన్న విషయంపై ముగ్గురు క్యాండిడేట్లు లెక్కలు వేసుకుంటున్నారు.

కీలకం కానున్న సామాజిక వర్గాల ఓట్లు

నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ నియోజకవర్గంలో మొత్తం 17,34,773 మంది ఓటర్లు ఉన్నారు. పాత జనాభా లెక్కలు, దళిత ఉపకులాల లెక్కల ప్రకారం నియోజకవర్గంలో మాదిగలు 3.90 లక్షల వరకు ఉంటే, మాలలు 70 వేల మంది వరకు ఉంటారని అంచనా. బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ క్యాండిడేట్లు ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కాగా కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ మల్లు రవి సామాజిక వర్గం వేరు. 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక వర్గాలు, ఉపకులాల పట్టింపులు లేకుండా కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్లను గెలిపించారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌.ప్రవీమ్‌‌‌‌కుమార్‌‌‌‌, బీఎస్పీ క్యాండిడేట్‌‌‌‌ మందా జగన్నాథం అలంపూర్‌‌‌‌ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారు కాగా, బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌ కల్వకుర్తి నియోజకవర్గంలోని గుండూరుకు చెందినవారు. కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ మల్లు రవి స్థానికేతరుడని ప్రత్యర్థులు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నా 1991లో మొదటిసారి ఎంపీగా గెలిచినప్పటి నుంచి నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ నియోజకవర్గంతో ఆయనకు ప్రత్యక్ష సంబంధాలున్నాయి. 

మందా ఎఫెక్ట్‌‌‌‌ ఎవరిపైనో ?

నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ లోక్‌‌‌‌సభ స్థానం నుంచి మల్లు రవి రెండు సార్లు, మందా జగన్నాథం నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు. 1991లో మొదటిసారి ఎంపీగా గెలిచిన మల్లు రవి, 1998లో రెండోసారి పార్లమెంట్‌‌‌‌కు వెళ్లారు. విద్యార్థి దశలో కాంగ్రెస్‌‌‌‌ అనుబంధ రాజకీయ విభాగంలో చేరిన మల్లు అప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్‌‌‌‌లోనే కొనసాగుతున్నారు. వైఎస్​హయాంలో కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేశారు. 1996లో టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన మందా జగన్నాథం అదే పార్టీ నుంచి నాలుగు సార్లు ప్రాతినిథ్యం వహించారు.​ టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరిన ఆయన 2014లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ నంది ఎల్లయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. 2018లో టీఆర్ఎస్‌‌‌‌ నుంచి పోటీ చేసిన పోతుగంటి రాములు ఎంపీగా గెలిచారు.

గెలుపుపై మందా ధీమా

బీఎస్పీ క్యాండిడేట్‌‌‌‌గా బరిలో దిగుతున్న మందా జగన్నాథం గెలుపుపై ధీమాగా ఉన్నారు. నాలుగు సార్లు ఎంపీగా, రెండు సార్లు కేంద్రంలో రాష్ట్ర  ప్రభుత్వ ప్రతినిధిగా చేసిన సేవలు, తన వ్యక్తిత్వమే గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌.ప్రవీణ్‌‌‌‌ కుమార్‌‌‌‌ బీఎస్పీ చీప్‌‌‌‌గా పనిచేసిన టైంలో తయారు చేసిన కేడర్‌‌‌‌ మందా జగన్నాథంకు అడ్వంటేజీగా మారుతుందన్న టాక్‌‌‌‌ వినిపిస్తోంది. మంద గెలుపోటముల అంశాన్ని పోటీలో ఉన్న మిగతా ముగ్గురు క్యాండిడేట్లు సీరియస్‌‌‌‌గా తీసుకోకపోయినా.. తమకు అనుకూలంగా ఉండే ఓట్లపై ఆయన ఎంత వరకు ప్రభావం చూపుతారన్న ఆలోచనల్లో పడుతున్నారు.