రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్ అబద్ధాలు: ఎంపీ మల్లు రవి కామెంట్​

హైదరాబాద్, వెలుగు: నాగర్​కర్నూల్  జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్  ఆత్మహత్యకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని నాగర్​కర్నూల్ ఎంపీ మల్లు రవి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాను స్వయంగా ఆ ఊరికి వెళ్లి రాత్రి అక్కడే బసచేసి గ్రామ స్తులతో మాట్లాడానని ఆయన చెప్పారు. గ్రామంలో ఆయన ఇంటికి రోడ్డు లేకుండా చేశారని ఆరోపణలు చేయడం పూర్తిగా అవాస్తవమన్నారు.

గ్రామస్తుల కోరిక మేరకు ప్రభుత్వ స్థలంలో పశువుల ఆస్పత్రి నిర్మించారని, ఆయన ఇంటికి దారి కూడా వదిలేశారని, అయినా వివాదం లేపుతున్నారని పేర్కొన్నారు. వాస్తవాలు చెప్పినా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మళ్లీ అదే విషయంలో ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. మాజీ సర్పంచ్  ఇంటికి దారి లేనట్టు కేటీఆర్ నిరూపిస్తే తాను ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని సవాల్  విసిరారు. రాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఎంపీ మండిపడ్డారు.