నాగర్​కర్నూల్లో వర్షం ఎఫెక్ట్

  • 1,200 ఎకరాల్లో పంట నష్టం
  • మత్తడి పోస్తున్న చెరువులు, పొంగుతున్న వాగులు
  • పునరావాస గ్రామాల్లో నిర్వాసితుల గోస

నాగర్​కర్నూల్, వెలుగు: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు నాగర్​కర్నూల్​ జిల్లా అతలాకుతలమైంది. వాగుల్లో వరద ఉధృతి తగ్గకపోవడంతో రాకపోకలు నిలిపేశారు. చెరువులు మత్తడి పోస్తున్నాయి. ఆరు మండలాల్లోని 612 మంది రైతులకు చెందిన 1,200 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు అంచనా  వేశారు. నిర్వాసిత గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. వట్టెం రిజర్వాయర్  పునరావాస గ్రామంలోని ఇళ్లల్లోకి పక్కనే ఉన్న గుట్ట పై నుంచి మట్టిపెళ్లలు,రాళ్లు జారిపడి బురద నీటితో ఆగం అవుతున్నారు. గుట్టపై ఉన్న వాటర్​ ట్యాంక్​ కూలిపోతుందని ఆందోళన చెందుతున్నారు.


ఎస్ఎల్​బీసీ ప్రాజెక్ట్​ రిజర్వాయర్​ నక్కలగండిలోకి చేరిన నీరు సమీపంలోని మర్లపాడుతండాలోకి రావడంతో ఎమ్మెల్యే వంశీకృష్ణ, కలెక్టర్​ బదావత్​ సంతోష్​ గ్రామానికి వెళ్లి నిర్వాసితులతో మాట్లాడారు. మెరుగైన ప్యాకేజీ ఇప్పిస్తామని భరోసా ఇచ్చారు.
    
తిమ్మాజీపేట మండలం గొరిట గ్రామంలో చెరువు అలుగు పారి పంట పొలాలు మునగగా, నాగర్​ కర్నూల్​ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్​రెడ్డి పరిశీలించారు.
    
తిమ్మాజీపేట మండలం ఇప్పలపల్లి తండాకు వెళ్లే రోడ్డు కొట్టుకుపోవడంతో రిపేర్లు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
    
కొల్లాపూర్​ మండలం చౌటబెట్ల-తాళ్ల, నరసింహాపురం వెళ్లే ప్రధాన రహదారి కొట్టుకుపోయింది. 
    
నాగర్​ కర్నూల్​ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ ఊరకుంటకు గండిపడింది
    
ఉప్పునుంతల మండలం దాసర్లపల్లి చిన్నవాగుకు ప్రవాహం పెరిగి పంట పొలాలు దెబ్బతిన్నాయి. 
    
నాగర్ కర్నూల్, కల్వకుర్తి, తిమ్మాజీపేట, అమ్రాబాద్, బల్మూరు, లింగాల, తిమ్మాజీపేట, కొల్లాపూర్, ​పెంట్లవెల్లి,పెద్దకొత్తపల్లి మండలాల్లో 43 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
    
కొల్లాపూర్​లోని ఎస్టీ బాయ్స్​ హాస్టల్​ ఆవరణలోకి వరద నీరు చేరింది.

115 ఇండ్లు నేలమట్టం

వనపర్తి/ ఖిల్లాగణపురం/మదనాపురం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వనపర్తి జిల్లాలో పంట, ఆస్తి నష్టం జరిగింది. జిల్లాలోని రామన్​పాడు, సరళాసాగర్, శంకరసముద్రం, రంగసముద్రం నుంచి నీటిని కిందికి వదులుతున్నారు. కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్​ కింద కాల్వలు తెగి నీరు పంట పొలాల్లోకి చేరుతోంది. పంటలు వరదకు కొట్టుకుపోగా, పొలాల్లో ఇసుక మేట వేసింది.

 జిల్లాలో 650 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు 115 ఇండ్లు వర్షాలకు దెబ్బతిన్నాయి. గోపాల్​పేట మండలంలో ఎక్కువ పంట నష్టం జరిగింది. మదనాపురం వద్ద కల్వర్టు వరద నీటితో నిండిపోవడంతో రెండు రోజులుగా వనపర్తి–-ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.