శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం భ్రమరాంబిక, మల్లికార్జునస్వామిని సినీ నటుడు అక్కినేని నాగార్జున, నాగచైతన్య, శోభిత దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. రాజగోపురం వద్ద ఆలయ మర్యాదలతో అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. నాగ చైతన్య, శోభిత వివాహం తరువాత స్వామి, అమ్మవార్ల ఆశీస్సుల కోసం శ్రీశైలం వచ్చారు. మల్లన్నకు అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారి ఆలయ ముఖ మండపం వద్ద వేద పండితులు ఆశీర్వచనాలు, లడ్డూ ప్రసాదాన్ని అందించారు. నాగార్జున, నాగచైతన్య, శోభితను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు.