కాంగ్రెస్ ఏడాది పాలన సంతృప్తినిచ్చింది : కుందూరు జైవీర్ రెడ్డి

హాలియా, వెలుగు : కాంగ్రెస్ ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చిందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి అన్నారు. మంగళవారం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నిటినీ దశలవారీగా అమలు చేస్తుందన్నారు. ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు తన సొంత ఖర్చులతో విద్యార్థులకు దుప్పట్లు, బెంచీలు అందజేశానని చెప్పారు. 

నెల్లికల్ లిఫ్ట్​ పథకం, చలకుర్తిలో ఇంటిగ్రేటెడ్​స్కూల్​ను ఈనెల 22న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. తిరుమలగిరి (సాగరం) మండలం బోయగూడం, రాజవరం, గాత్ తండాలో 7 వేల ఎకరాలకు సాగునీటి అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ముకుందాపురం నుంచి అల్వాల వరకు పెద్దగూడెం, అన్నారం, వెళ్లమగూడెం గ్రామాల రహదారుల అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభంకానున్నట్లు తెలిపారు. 

నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం హాలియా మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందికి డ్రెస్ కోడ్, విద్యార్థులకు దుప్పట్లు, దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు.