నాగర్​కర్నూల్ అభివృద్ధికి కృషి చేస్తా

  • ఎంపీ మల్లురవి

వనపర్తి, వెలుగు:  వనపర్తి జిల్లా అభివృద్ధికి అధికారులు కృషి చేస్తున్నారని, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని నాగర్ కర్నూల్ ఎంపీ  మల్లు రవి అన్నారు.  మంగళవారం కలెక్టరేట్​లో కలెక్టర్ ఆదర్శ్ సురభితో సమావేశం నిర్వహించారు.  గురుకులాలు, హాస్టళ్లలో  ఏవైనా ఖాళీలుంటే వెంటనే భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యలు ఉంటే జిల్లా కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు పంపాలని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.  ధరణిలో కొత్త మాడ్యూల్ ల  వల్ల సమస్యల పరిష్కారం ఏ మేరకు జరుగుతున్నాయని అడిగి  తెలుసుకున్నారు.

 జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..  జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వారంలో రెండు రోజులు డ్రై డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,  డెంగ్యూ పాజిటివ్ కేసు నమోదు అయితే నివారణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎమ్మెల్యే  తూడి మేఘా రెడ్డి మాట్లాడుతూ..  వనపర్తి జిల్లాకు రైల్వే లైన్, జాతీయ రహదారి మంజూరుతో పాటు జిల్లా అభివృద్ధికి అధికంగా నిధులు మంజూరు చేయాలని ఎంపీని కోరారు.  సమావేశంలో  ఎస్సీ కార్పొరేషన్​ చైర్మన్​ ప్రీతం, మున్సిపల్ చైర్మన్ మహేశ్, వనపర్తి, కొత్తకోట మార్కెట్ కమిటీ చైర్మన్లు  శ్రీనివాస్ గౌడ్,  ప్రశాంత్, జిల్లా సంక్షేమ శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.