కోహిమా: నాగాలాండ్ లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 15కి పెరిగింది. శనివారం రాత్రి నాగాలాండ్‌లోని మోన్ జిల్లా పరిధిలోని ఓటింగ్ గ్రామంలో అస్సాం రైఫిల్స్ జరిపిన కాల్పుల్లో 14 మంది పౌరులు, ఒక సైనికుడు మరణించారు. ఈ ఘటన జరిగన మోన్ జిల్లాలో సోమవారం కర్ఫ్యూ విధించారు. ఈ మేరకు కర్ఫూ విధిస్తున్నట్లు నాగాలాండ్ హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో మోన్ జిల్లాలో సెక్షన్ 144 అమల్లోకి వచ్చింది. మొబైల్ ఇంటర్నెట్ సేవలు, బల్క్ మెసేజింగ్ సర్వీసులను ప్రభుత్వం నిలిపివేసింది.
కాగా, బొగ్గుగని కార్మికులను తిరుగుబాటుదారులుగా భావించిన ఆర్మీ పికప్ వ్యాన్ పై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఘటనపై అత్యున్నత స్థాయిలో విచారణ జరుపుతున్నామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆర్మీ విభాగం వివరించింది. తిరుగుబాటు దారుల కదలికలపై తమకు అందిన విశ్వసనీయమైన సమాచారం ఆధారంగా ఆపరేషన్ ప్లాన్ చేశామని, కాని దురదృష్ట వశాత్తూ పౌరులు మృతి చెందారని ఆర్మీ తెలిపింది.
హోం మినిస్ట్రీ ఏం చేస్తోంది?: రాహుల్
నాగాలాండ్ భద్రతా దళాల కాల్పుల ఘటనపై కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. అసలు ప్రభుత్వం ఏం చేస్తోందంటూ కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీతోపాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లాంటి నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ‘మన సొంత దేశంలో పౌరులు, భద్రతా బలగాలు సేఫ్ గా లేనప్పుడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏం చేస్తున్నట్లు’ అని రాహుల్ ప్రశ్నించారు. దీనికి కేంద్రం జవాబు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
