వైఎస్ జగన్ పై జనసేన నేత నాగబాబు ఫైర్

ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలన్న వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యలపై మెగా బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు స్పందించారు. వైఎస్ జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వినుకొండలో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకోవాలని జగన్ చూస్తున్నారని చెప్పారు.  ఇప్పటికైనా శవరాజకీయాలను మానుకోవాలన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాలేదని.. అప్పుడే విమర్శలేంటి? అని ప్రశ్నించారు. 


ఏపీలో అరాచక పాలన కొనసాగుతుందని రెండు నెలలు కాకముందే ఎలా అంటారని మండిపడ్డారు. ఏపీలో పాలనకు వ్యతిరేకంగా ఈ నెల 24న ఢిల్లీలో ధర్నా చేస్తామని వైఎస్‌ జగన్‌ చెప్పడం హాస్యాస్పదం అన్నారు. అసెంబ్లీకి రావడానికి భయపడే జగన్ కు ఎన్డీఏ పాలనపై విమర్షించే హక్కు లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టడానికే ఢిల్లీలో ధర్నా  అంటూ జగన్ డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.

 

దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత దుర్మార్గ పాలన ఏపీలో జగన్‌ హయాంలో చూశామని తెలిపారు. జగన్ పాలనలో ప్రజలు అన్ని రకాలుగా బాధలు అనుభవించారని తెలిపారు. అప్పుడు చలనం లేని మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు ఇప్పుడు ప్రజలు గుర్తుకొచ్చారా.. అధికారం పోగానే రాష్ట్రం గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు.