2024 ఎన్నికల్లో జగన్ ను గద్దె దించటమే ఉమ్మడి లక్ష్యంగా టీడీపీతో పొత్తు కుదుర్చుకున్న జనసేన పార్టీలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఊహించని ట్విస్టులు ఎదురవుతున్నాయి. పొత్తులో భాగంగా కేటాయించిన 24 అసెంబ్లీ సీట్ల, 3ఎంపీ సీట్లలో కోత ఒక ట్విస్ట్ అయితే, అనకాపల్లి నుండి ఎంపీ టికెట్ ఆశించిన నాగబాబుకు ఆ సీటు కేటాయించకపోవటం మరొక ట్విస్ట్. ఈ పరిణామాలపై స్పందించిన నాగబాబు పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన కార్యకర్తగా ఉండటం కంటే తనకు ఏ పదవి ముఖ్యం కాదని అన్నారు. ఈ ఎన్నికల్లో సీటు ఆశించి దక్కనివారు తనతోపాటు పోతిన మహేష్ లాంటివారు చాలామంది ఉన్నారని అన్నారు.
పవన్ కళ్యాణ్ తనకు పదవి ఇచ్చినా ఇవ్వకున్నా పార్టీ కోసం పని చేస్తానని, జనసేన కార్యకర్తగా నాయకుడి ఆశయాల కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ క్రమంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ నాగబాబుకు సీటు దక్కకపోవటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తులో భాగంగా త్యాగాలు చేయాల్సి వచ్చిందని, తన సొంత అన్న నాగబాబుకు సీటు దక్కలేదని అన్నారు. మొదట సీటు ఇస్తానని తానే స్వయంగా చెప్పానని, ఇప్పుడు ఇవ్వలేకపోయానని అన్నారు. ఎక్కడ ప్రచారం చేయమంటే అక్కడి నుండి ప్రచారం చేస్తానని నాగబాబు లేఖ రాసినట్లు తెలిపాడు పవన్ కళ్యాణ్.