మూడూర్ల ప్రజల జుట్టు ఊడిపోతోంది..మహారాష్ట్రలో విచిత్ర పరిస్థితి!

  • రంగంలోకి దిగిన హెల్త్ ఆఫీసర్లు

ముంబై: మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ప్రజలు వింత సమస్యను ఎదుర్కొంటున్నారు.షెగావ్ తహసీల్‌‌‌‌లోని బోర్గావ్, కల్వాడ్, హింగ్నా అనే మూడు గ్రామాల్లో ప్రజలందరికీ కొన్ని రోజులుగా తలపై వెంట్రుకలు విపరీతంగా రాలిపోతున్నాయి. వారి జుట్టు కుదుళ్లు చాలా బలహీనంగా మారిపోయాయి. తలను ముట్టుకోవడమే పాపం వెంట్రుకలు రాలిపోతున్నాయి.  

కేవలం వారం వ్యవధిలోనే ఓ వ్యక్తికి బట్టతల రావడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. ఏ కారణం లేకుండా  జుట్టు ఊడిపోతుండటంతో ప్రజలు భయపడిపోతున్నారు. ఇప్పటికే మూడు గ్రామాల్లోని చాలా మందికి బట్టతల కనిపిస్తున్నదని చెబుతున్నారు. 

 జుట్టు, స్కిన్ శాంపిల్స్ సేకరణ

బోర్గావ్, కల్వాడ్, హింగ్నా గ్రామల ఆందోళన నేపథ్యంలో మహారాష్ట్ర హెల్త్ అధికారులు రంగంలోకి దిగారు. టెస్ట్ కోసం మూడు గ్రామాల్లోని ప్రజల నుంచి జుట్టు, చర్మ నమూనాలతో పాటు నీటి శాంపిల్స్ సేకరించారు. జుట్టు వేగంగా  రాలిపోవడానికి నీటి కాలుష్యమే కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. సుమారు 50 మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. టెస్ట్ రిపోర్ట్స్ వచ్చేవరకు బాధితులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులు కోరారు.