పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతోంది. అన్ని పార్టీల ముఖ్య నేతలు పోటీలు పడి మరీ ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ(సోమవారం) ఎన్నికల ప్రచారంలో భాగంగా రాణిబంద్ లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన అమిత్ షా.. నందిగ్రామ్ ఘటనకు సంబంధించి సీఎంమమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. నా హెలికాప్టర్‌లో టెక్నికల్ లోపం కారణంగా ఇక్కడకు వచ్చేందుకు తనకు ఆలస్యమైందని.. అంతేకానీ దాన్ని నేను కుట్ర అని అనను అన్నారు అమిత్ షా. నందిగ్రామ్ ఘటన మమతపై జరిగిన దాడి కాదని.. ఎన్నికల సంఘం కూడా తేల్చిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు. అంతేకాదు.. మీ హయాంలో 130 మంది బీజేపీ కార్యకర్తలు చనిపోయారన్నారు. వాళ్ల బాధ ఎంతో మీకు తెలుసా? మీ కాలికి గాయం తగిలిన తర్వాత మీకు నొప్పి తెలుస్తోంది అని షా విమర్శించారు.
నందిగ్రామ్‌లో నామినేషన్ వేసిన తర్వాత సీఎం మమతా బెనర్జీ గాయపడ్డారు. అయితే ఎవరో నలుగురైదుగురు వ్యక్తులు తనను కావాలనే తోసేయడం కారణంగా గాయపడ్డానని, ఇది కుట్ర అని మమత ఆరోపించారు. అయితే ఈ ఘటనపై విచారణ జరిపిన ఎన్నికల సంఘం మాత్రం మమతపై దాడి జరగలేదని తేల్చింది.
