త్వరలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్​

  • కసరత్తు చేస్తున్న రాష్ట్ర సర్కారు
  • ఫ్యాక్టరీపై బ్యాంకులో ఉన్న అప్పుల కింద  రూ.150 కోట్లు చెల్లించిన సర్కారు
  • 51 శాతం వాటా ఉన్న పారిశ్రామికవేత్త రంగరాజుతో ఆర్బిట్రేషన్ కు ప్రయత్నాలు
  • మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఇప్పటికే ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ
  • హామీని నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం చర్యలు

కరీంనగర్, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో మూతపడిన ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్​ సర్కారు చర్యలు తీసుకుంటున్నది. 

ఇప్పటికే రాష్ట్ర ఐటీ,ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేబినెట్ సబ్ కమిటీ వేయగా.. ఈ ఏడాది మార్చిలో శ్రీధర్​బాబు ఫ్యాక్టరీని సందర్శించి, చెరుకు రైతులతో మాట్లాడారు. 2025 డిసెంబర్ లోగా ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని  ప్రకటించారు. 

ఈ క్రమంలోనే ఫ్యాక్టరీపై బ్యాంకులో ఉన్న అప్పుల కింద రూ.150 కోట్లు చెల్లించిన సర్కారు.. 51 శాతం వాటా ఉన్న పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ గోకరాజు రంగరాజుతో ఆర్బిట్రేషన్ కు ప్రయత్నాలు చేస్తున్నది. ఈ ప్రయత్నాలు సఫలమై ఫ్యాక్టరీ రీఓపెన్ అయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభించనున్నది. కాగా, ఫ్యాక్టరీ నిరంతరాయంగా నడవాలంటే రైతులు 15 వేల ఎకరాల్లో 70 వేల మెట్రిక్ టన్నుల చెరుకును పండించాల్సి ఉంటుంది. 

గత బీఆర్ఎస్​ సర్కారు హయాంలోనే మూత.. 

నిజామాబాద్ జిల్లా బోధన్ లోని నిజాం షుగర్స్ కు అనుబంధంగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో 1982లో అప్పటి ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించింది. దీంతో వేలాది మంది కార్మికులు, చెరుకు రైతులకు ఉపాధి లభించింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే స్వాధీనం చేసుకుంటామని బీఆర్ఎస్ అధినేత హోదాలో 2014 ఎన్నికల ప్రచారంలో కేసీఆర్​ ప్రకటించారు. 

కానీ ఆయన సీఎం అయ్యాక.. షుగర్ ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకోకపోగా.. 2015 డిసెంబర్ లో మూతపడుతుంటే మౌనం వహించారు. కో ఆపరేటివ్ విధానంలో ఈ ఫ్యాక్టరీలను నడుపుతామంటూ అంతకుముందే మొక్కుబడిగా 2015 ఏప్రిల్ లో జీవో విడుదల చేసి, చేతులు దులుపుకొన్నారు. ఆ తర్వాత ఎనిమిదేండ్లలో అటువైపు కన్నెత్తి చూడలేదు.  దీంతో 40 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. 

రైతులు కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాల్సి వచ్చింది. ఇప్పటికీ జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, మెట్‌‌‌‌పల్లి, కోరుట్ల, బీర్‌‌‌‌పూర్‌‌‌‌, ఇబ్రహీంపట్నం, సారంగాపూర్‌‌‌‌, మల్లాపూర్‌‌‌‌ మండలాల రైతులు చెరుకు ప్రధాన పంటగా సాగు చేస్తున్నారు.  ట్రాన్స్ పోర్టేషన్ ఖర్చులు భారమైనా 100 కిలో మీటర్ల దూరంలోని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ కు తరలించి, అక్కడ అమ్ముకుంటున్నారు. 

హామీని నిలబెట్టుకునే దిశగా సర్కారు అడుగులు 

ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని రీ ఓపెన్ చేయాలని గత ఎనిమిదేండ్లుగా ఫ్యాక్టరీ కార్మికులు, చెరుకు రైతులు ఆందోళలు చేస్తున్నారు. దీంతో ఈ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోరుట్ల నియోజకవర్గ ఎన్నికల ఎజెండాలో ప్రధానాస్త్రంగా మారింది. ఈ క్రమంలోనే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాదయాత్రలో భాగంగా పీసీసీ అధ్యక్షుడి హోదాలో  కోరుట్ల నియోజకవర్గానికి వచ్చిన రేవంత్ రెడ్డి.. ముత్యంపేటలో ఒకరోజు రాత్రి బస చేశారు. 

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చక్కెర పరిశ్రమలను పునరుద్ధరిస్తామని  ఆ సమయంలో చెరుకు రైతులకు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి రాగానే ఈ ఏడాది జనవరిలో శ్రీధర్ బాబు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి, చర్యలు ప్రారంభించారు. 2025 డిసెంబర్ లోగా ఫ్యాక్టరీలో ఉత్పత్తిని ప్రారంభించాలని టార్గెట్ గా పెట్టుకున్నప్పటికీ నెల 
ముందే ప్రారంభిస్తామనే ధీమాతో ప్రభుత్వం ఉన్నది.