Irani Cup 2024: భారత క్రికెటర్‌కు యాక్సిడెంట్.. ఇరానీ కప్‌కు దూరం

ముంబై యువ బ్యాటర్ ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదంలో ఫ్రాక్చర్‌కు గురయ్యాడు. ముషీర్ తన తండ్రి నౌషాద్‌తో కలిసి కాన్పూర్ నుండి లక్నోకు ప్రయాణిస్తుండగా అనుకోని ప్రమాదం జరిగింది. ముషీర్ మెడకు బలమైన గాయమైనట్టు.. అతను కనీసం ఆరు వారల నుంచి   మూడు నెలల వరకు ఆటకు దూరంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై స్పష్టత రాలేదు. 

కారు రోడ్డుపై నాలుగు నుంచి ఐదు సార్లు పల్టీలు కొట్టినట్టు.. దీంతో ముషీర్ తలకు తీవ్ర గాయమైనట్టు నివేదికలు తెలుపుతున్నాయి. ముషీర్ యాక్సిడెంట్ పై ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ముషీర్ కు యాక్సిడెంట్ కావడంతో అతను శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో అక్టోబర్ 1 నుండి జరగనున్న ఇరానీ కప్ మ్యాచ్‌కు దూరం కానున్నాడు. దీంతో పాటు ఈ సీజన్ రంజీ ట్రోఫీకి కూడా ఆడడం అనుమానంగా మారింది. 

సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడిగా క్రికెట్ లో ఎంట్రీ ఇచ్చి దేశవాళీ క్రికెట్ లో తనదైన ముద్ర వేశాడు. ఇటీవలే దులీప్ ట్రోఫీలో ఇండియా బి  తరపున ఇండియా ఏ పై 181 పరుగులు చేశాడు. అయితే చివరి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో అతను రెండు సార్లు డకౌటయ్యాడు. ముషీర్ టెస్ట్ ఫార్మాట్ లో 15 ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు, ఒక అర్ధసెంచరీతో 716 పరుగులు చేశాడు. శ్రీలంక వేదికగా జరిగిన 2024 అండర్ 19 వరల్డ్ కప్ లోనూ అద్భుతమైన ప్రదర్శన చేశాడు.