విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తాం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

  • ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చండూరు, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతోపాటు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం చండూరు మండలం బోడంగిపర్తి గ్రామంలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులు, స్టోర్ రూమ్, వంట గది, బాత్రూంలను పరిశీలించారు. భోజనంలోకి ఎలాంటి కూరగాయలు వాడుతున్నారు..? ఏ కంపెనీ నూనె వాడుతున్నారు..? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు చన్నీళ్లతో స్నానం చేస్తున్న విషయాన్ని  ఉపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే సోలార్ హీటర్ ఏర్పాటు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. 

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాభివృద్ధి కోసం పలు చర్యలు చేపట్టిందన్నారు. రాబోయే రోజుల్లో బోడంగిపర్తి పాఠశాల లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ధోటి వెంకటేశ్ యాదవ్, కోడి శ్రీనివాస్, కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు కొరిమి ఓంకారం, టౌన్ ప్రెసిడెంట్ అనంతచంద్రశేఖర్ గౌడ్, పల్లె వెంకన్న తదితరులు ఉన్నారు.