పట్టణంలో కమిషనర్ విస్తృత పర్యటన

  • శుభ్రత పాటించని హోటళ్లకు జరిమానాలు

సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట పట్టణంలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ విస్తృతంగా పర్యటించి శుభ్రత పాటించని హోటళ్లకు జరిమానా విధించారు. హయత్ హోటల్ కు రూ. 30 వేలు,  అక్షయ హోటల్ కు రూ. 15వేలు జరిమానా విధించారు.  నర్సాపూర్ చౌరస్తా వద్ద కొత్తగా నిర్మిస్తున్న నేషనల్ మార్ట్ వారు అనుమతి లేకుండా యుజీడీ  కనెక్షన్ తీసుకోవడంతో రూ.10 వేల జరిమానా విధించాలని ఆదేశించారు.

నర్సాపూర్ రోడ్డులోని  నరసింహ స్వామి మటన్ & చికెన్ సెంటర్ వారు ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తున్నందుకు రూ.5 వేలు, 33వ వార్డులో శ్రీరామ హాస్పిటల్ (డయగ్నోస్టిక్)  సెంటర్  వ్యర్థాలను బయట పడేయడంపై రూ. 5 వేల జరిమానా విధించారు. వార్డుల పర్యటన సందర్భంగా నల్లాలకు మోటార్లు బిగించడాన్ని గమనించి వాటిని తొలగించడమే కాకుండా ఇలాంటి చర్యలకు పాల్పడితే గృహ యజమానులపై చర్యలుంటాయని హెచ్చరించారు.

పట్టణంలో గల టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, ఇతర వాణిజ్య వ్యాపారులు రోడ్డు పైకి  వచ్చేలా వేసిన రేకుల షెడ్లను తొలగించాలని, ఫుట్ పాత్ లను ఆక్రమించి వారిపైచర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డ్  చైతన్యపురి కాలనీలో రోడ్డు ఆక్రమణ చేశారన్న ఫిర్యాదు మేరకు కమిషనర్ అశ్రిత్ కుమార్ ఆదేశాలమేరకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది కనిలను  తొలగించారు.