ముంబై: భారీ వర్షాలు ముంబైని ముంచెత్తుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వానలు పడుతుండటంతో జనం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నరు. రైల్వే ట్రాక్‌లు, రోడ్లు సహా సిటీలోని చాలాచోట్లపై ఎఫెక్ట్ పడింది. ట్రాఫిక్ స్తంభించిపోయింది. మెయిన్ రోడ్లతోపాటు పలు స్టేషన్లలో మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచిపోయాయి. సియాన్‌లో వరద నీళ్లు ముంచెత్తిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంధేరి, ఘట్కోపర్, ధారావి, చెంబూర్, దాదర్, వడాలా, పన్వేల్‌లో చాలా ఏరియాలను వరద ముంచెత్తింది. సహాయక చర్యల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఐదింటిని అధికారులు మోహరించారు. ముంబై, చుట్టుపక్క జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని, ఎలాంటి ప్రాణ నష్టం జరగొద్దని కొత్త సీఎం ఏక్‌నాథ్ షిండే ఆదేశాలిచ్చారు.
సిటీ అంతటా వదలని వాన
సోమవారం ఉదయం నుంచి ముంబైలో వాన పడుతూనే ఉన్నది. మంగళవారం ఉదయం 8 గంటల దాకా సౌత్ ముంబైలో 9.6 సెంటీమీటర్ల వర్షం కురిసిందని, తూర్పు శివారు ప్రాంతాల్లో 11.5 సెంటీమీటర్లు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో 11.6 సెంటీమీటర్లు కురిసిందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు చెప్పారు. మంగళవారం ఉదయం 8 నుంచి నుంచి 11.30 దాకా సౌత్ ముంబైలో 4 సెంటీమీటర్లు, తూర్పు శివారు ప్రాంతాల్లో 8.5 సెంటీమీటర్లు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో 5.5 సెంటీమీటర్లు కురిసినట్లు తెలిపారు. బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై, ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్).. పలు సర్వీసులను దారి మళ్లించింది.
లోకల్ ట్రైన్లపై ఎఫెక్ట్
ముంబైకి లైఫ్‌లైన్ లాంటి లోకల్ రైలు సర్వీసులపై వర్షం ఎఫెక్ట్ పడింది. కుర్లా దగ్గర పట్టాలపైకి నీరు చేరడంతో సెంట్రల్ రైల్వే ప్రధాన, హార్బర్ కారిడార్లలో రైళ్ల రాకపోకలు ఆలస్యంగా సాగుతున్నాయి. మరోవైపు చాలా ట్రైన్లు ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్(సీఎస్ఎంటీ) వైపు వరుసకడుతున్నాయి. సియాన్, కుర్లా, తిలక్ నగర్, వడాలా ఏరియాల్లో ట్రాకులన్నీ నీటితో నిండిపోయాయని సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్‌వో శివాజీ సుతార్ చెప్పారు. నవీ ముంబైలో హార్బర్ లైన్‌లోని పన్వేల్, ఖాందేశ్వర్, మాన్‌సరోవర్ తదితర సబ్‌వేల్లో భారీగా నీరు చేరినట్లు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. తాము నడుములోతు నీటిలో వెళ్లాల్సి వచ్చిందని వాపోయారు.
మరో నాలుగు రోజులు
థానె జిల్లాలో కొన్ని రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ముంబై, థానె, సతారా ఏరియాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. సౌత్ కొంకణ్, గోవాకు ఆరెంజ్ అలర్ట్.. నార్త్ కొంకణ్, నార్త్ సెంట్రల్, సౌత్ సెంట్రల్, మరాఠ్వాడా రీజియన్లకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 8 దాకా భారీ వర్షాలు కురవొచ్చని రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్, పాల్ఘర్, కొల్హాపూర్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాయ్‌గఢ్ జిల్లాలో కుండలికా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. థానె సిటీలో పలు ఏరియాలో జలమయమయ్యాయి.
