IPL 2025: ఐపీఎల్ 2025.. ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా జయవర్ధనే

ఐపీఎల్ 2025కి ముందు ముంబై ఇండియన్స్ తమ హెడ్ కోచ్ ను ప్రకటించింది.  శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనేని తమ ప్రధాన కోచ్‌గా తిరిగి నియమించింది. బౌచర్ స్థానంలో జయవర్ధనే బాధ్యతలు స్వీకరించాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో బౌచర్ హెడ్ కోచ్ గా ముంబై కేవలం నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. దీంతో మరోసారి జయవర్ధనే వైపు మొగ్గు చూపింది.

"ముంబై ఇండియన్స్‌కు మహేల తిరిగి ప్రధాన కోచ్‌గా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది" అని ఫ్రాంచైజీ యజమాని ఆకాష్ అంబానీ అన్నారు. జయవర్ధనే టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కోచ్‌లలో ఒకడు. జయవర్ధనే 2017 నుంచి 2022 వరకు ముంబై ప్రధాన కోచ్‌గా పనిచేశారు. అతడు హెడ్ కోచ్ గా ఉన్నప్పుడు ముంబై మూడు ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకుంది. ఐపీఎల్‌లో పాటు, జయవర్ధనే హండ్రెడ్ (సదరన్ బ్రేవ్) లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (ఖుల్నా టైటాన్స్) జట్లకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నాడు.

ఐపీఎల్ 2025 కోసం.. మొదటి రిటైన్ ప్లేయర్ గా కెప్టెన్ హార్దిక్ పాండ్య.. రెండో రిటైన్ ఆటగాడిగా సూర్య కుమార్ యాదవ్.. మూడో రిటైన్ ప్లేయర్ గా ఇషాన్ కిషన్ తీసుకోనుంది. నాలుగో రిటైన్ ప్లేయర్ గా రోహిత్ శర్మను ఐదో రిటైన్ ఆటగాడిగా బుమ్రాను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిటైన్ రూల్స్ ప్రకారం తొలి రిటైన్ ప్లేయర్ కు రూ. 18 కోట్లు చెల్లించాల్సి ఉంది. రెండు, మూడు రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు ఇవ్వాల్సి ఉంది. నాలుగు ఐదు రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ. 14 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.