వ్యాపారిని మోసం చేసి డబ్బుతో ఉడాయిస్తున్న ఓ నకిలీ ఐపీఎస్ అధికారిని ఏకంగా 1200 కిలోమీటర్లు ఛేజింగ్ చేసిపట్టుకున్నారు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు. రాజస్థాన్‌లోని అజ్మీర్ బ్యావర్ కి చెందిన శివ్ శంకర్ శర్మ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. అందుకోసం నకిలీ పోలీస్ ఆఫీసర్ అవతారం ఎత్తి… బడా వ్యాపారస్తుల నుంచి డబ్బులు వసూల్ చేయడం వృత్తిగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో సూరత్‌కి చెందిన బట్టల వ్యాపారి మొహమ్మద్ ఎహతేషామ్ అస్లాం నావివలను మోసం చేసి రూ. 16 లక్షలు వసూల్ చేశాడు. వారం రోజుల క్రితం శర్మ నుంచి అస్లాంకి కాల్ వచ్చింది. ఐపీఎస్ ఆఫీసర్‌ను మాట్లాడుతున్నానని శర్మ తెలిపాడు. బట్టల ఎగుమతుల విషయంలో మీపై కంప్లైంట్ ఉందని, సెటిల్మెంట్‌కి రావాలని అస్లాంను ఆదేశించాడు. దీంతో అస్లాం.. శర్మ చెప్పినట్టుగా మెరైన్ డ్రైవ్‌లో ఉన్న ఓ హోటల్‌లో కలిసాడు.
అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో శివ్ శంకర్ శర్మ తన అనుచరులతో కలిసి అస్లాంని అదే హోటల్ రూమ్‌లో బంధించాడు. రూ. 16 లక్షలు ఇస్తేనే వదిలేస్తానంటూ బెదిరించాడు. శర్మ అడిగిన డబ్బు ఇవ్వడానికి అస్లాం ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అస్లాం స్వస్థలానికి తీసుకెళ్లారు. అక్కడ డబ్బు తీసుకున్న తర్వాత వదిలేశారు.మోసపోయిన అస్లాం సూరత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు క్రైమ్ జరిగింది ముంబైలో అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేయమని చెప్పారు. అస్లాం ముంబై వచ్చి మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అస్లాం ఫిర్యాదుతో ప్రత్యేక పోలీస్ బృందం శర్మ అతడి అనుచరులను పట్టుకోవడానికి రంగంలోకి దిగింది. ఈ విషయం శర్మకు తెలియడంతో పోలీసులను నుంచి తప్పించుకోవడానికి శర్మ లొకేషన్లు మార్చుతూ వచ్చాడు. ఈ క్రమంలో పోలీసులు అతన్ని పట్టుకోవడానికి రావడంతో కారులో ఉడాయించాడు. పోలీసులు శర్మ కారుని అనుసరిస్తూ దాదాపు 1200 కిలోమీటర్లు వెంబడించి బెంగుళురులో అతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత ముంబైకి తీసుకొచ్చి విచారణ చేపట్టారు.
