పెను విషాదం నింపిన ముంబై బోటు ప్రమాద ఘటన.. 13 మంది జల సమాధి..

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో బోటు ప్రమాదం జరిగింది. తొలుత ఈ ఘటనలో ఒకరు మాత్రమే చనిపోయినట్లు, మిగిలిన వారిని రెస్క్యూ టీం రక్షించినట్లు వార్తలొచ్చాయి. కానీ.. ఈ బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ బోటు ప్రమాద ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారని, 101 మందిని రెస్క్యూ చేసినట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. ఇండియన్ నేవీకి చెందిన స్పీడ్ బోట్ ముంబై హార్బర్లో ఇంజన్ ట్రయల్స్ నిర్వహిస్తుండగా.. ఇంజన్లో తలెత్తిన లోపం వల్ల ప్రమాదవశాత్తూ ప్రయాణికులతో వెళుతున్న ఫెర్రీ బోట్ను ఢీ కొట్టింది.

ఈ ఘటనలో ‘గేట్ వే ఆఫ్ ఇండియా’ నుంచి ప్రయాణికులతో ‘ఎలిఫెంటా కేవ్స్’కు వెళుతున్న ‘నీల్ కమల్’ ఫెర్రీ బోట్ సముద్రంలో మునిగిపోయింది. 100 మందికి పైగా ఉన్న ఆ బోట్ మునిగిపోవడంతో పలువురు సముద్రంలో గల్లంతయ్యారు. 101 మందిని రెస్క్యూ టీం రక్షించింది. 13 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో చనిపోయిన 13 మందిలో 10 మంది ప్రయాణికులు కాగా, మిగిలిన ముగ్గురూ నేవీ సిబ్బందిగా అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదంలో గల్లంతయిన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నాలుగు నేవల్ హెలికాఫ్టర్స్, 11 నేవల్ క్రాఫ్ట్స్, ఒక కోస్ట్ గార్డ్ బోట్, మూడు మెరైన్ పోలీస్ క్రాఫ్స్ట్ రెస్క్యూ ఆపరేషన్లో తలమునకలై ఉన్నాయి. 100 మందిని పైగా ఈ రెస్క్యూ ఆపరేషన్లో భాగంగా కాపాడగలిగారు. బుధవారం సాయంత్రం 3 గంటల 55 నిమిషాల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.