ముంబై అటాక్ మాస్టర్‌మైండ్, లష్కర్ ఏ తొయిబా (ఎల్‌ఈటీ) ఆపరేషన్స్ కమాండర్ జకీరుల్ రెహ్మాన్ లఖ్వీ అరెస్ట్ అయ్యాడు. పాకిస్థాన్‌లో లఖ్వీని అక్కడి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారని ఓ అధికారి తెలిపారు. సీటీడీ పంజాబ్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో లఖ్వీ దొరికాడని, టెర్రరిజం ఫైనాన్సింగ్ కింద అతడ్ని అరెస్ట్ చేశారని సదరు అధికారి చెప్పారు. సీటీడీ లాహోర్ పోలీసు స్టేషన్‌లో ఒక టెర్రర్ సంస్థకు చెందిన ఆర్థిక లావాదేవీల కేసు రిజిస్టర్ అయ్యింది. ఈ కేసు కిందే లఖ్వీని అదుపులోకి తీసుకున్నారని సమాచారం. లాహోర్‌లోని యాంటీ టెర్రరిజం కోర్టులో లఖ్వీ కేసు విచారణకు రానుంది. ముంబై దాడుల కేసులో 2015లో బెయిల్ పొందిన లఖ్వీని ఇప్పుడు కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (సీటీడీ) అరెస్ట్ చేసింది. అయితే అతడ్ని ఎక్కడ అరెస్ట్ చేశారనేది ఇంకా తెలియరాలేదు.
