మావోయిస్టుల కదలికలపై నిఘా పెంచాలి

మహబూబాబాద్, వెలుగు : మావోయిస్ట్‌‌‌‌ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసులు నిరంతరం అలర్ట్‌‌‌‌గా ఉండాలని, మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలని మల్టీజోన్‌‌‌‌ 1 ఐజీ చంద్రశేఖర్‌‌‌‌రెడ్డి సూచించారు. మహబూబాబాద్‌‌‌‌ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రివ్యూలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల పనితీరు, మావోయిస్టుల కదలికలు, లా అండ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ స్థితిగతులను ఎస్పీ సుధీర్‌‌‌‌రాంనాథ్‌‌‌‌ కేకన్‌‌‌‌ను అడిగి తెలుసుకున్నారు. మావోయిస్టులు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్‌‌‌‌ కేసులను త్వరగా పరిష్కరించాలని, కన్విక్షన్‌‌‌‌ రేట్‌‌‌‌ను పెంచాలని చెప్పారు. 5ఎస్‌‌‌‌ అమల్లో భాగంగా పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లోని రికార్డులను, ఫైళ్లను సక్రమంగా నిర్వహించాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నూతన చట్టాలపై పోలీసులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమావేశంలో అడిషనల్‌‌‌‌ ఎస్పీ జోగుల చెన్నయ్య, మహబూబాబాద్‌‌‌‌ డీఏస్పీ తిరుపతిరావు, ఏఆర్‌‌‌‌ డీఎస్పీలు శ్రీనివాస్, విజయ్‌‌‌‌ ప్రతాప్‌‌‌‌ పాల్గొన్నారు.