ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల క్షేత్రం గోవింద నామస్మరణతో మారుమోగుతోంది. శ్రీవారి ఆలయంలో వేకువజాము నుంచే వైకుంఠ ద్వార దర్శనం మొదలైంది. అర్ధరాత్రి 12 గంటల 5 నిమిషాల నుంచి ఒంటిగంట 30 నిమిషాల వరకు తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి ఏకాంతంగా ధనుర్మాస కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం దక్షిణ, ఉత్తర భాగంలోని వైకుంఠ ద్వారాలను తెరిచారు. ఒకటిన్నర గంటల నుంచి 4 గంటల వరకు అభిషేకం, తోమాల, అర్చన సేవలను నిర్వహించారు. ఆ తర్వాత వీఐపీ బ్రేక్ దర్శనం ప్రారంభమైంది. వివిధ కేటగిరీలకు చెందిన సుమారు 4 వేల మంది వీఐపీలు స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం సామాన్యభక్తులను దర్శనానికి అనుమతించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల కొండపైన తొలిసారిగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేశారు. దాంతో టీటీడీ విద్యుత్‌శాఖ విభాగం అద్భుతమైన లైటింగ్‌ను ఏర్పాటు చేసింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలను వివిధ రకాల పువ్వులతో అందంగా అలంకరించారు. దాదాపు ఆరు టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని, మరో నాలుగు టన్నుల పుష్పాలతో బయట ప్రాంతాల్లో అలంకరించారు. పుష్పాలంకరణలు భక్తులను ఎంతగానో ఆకట్డుకుంటున్నాయి.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇందు మల్హోత్రా, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాద్ రావు, మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాదవ్, మంత్రి మోపిదేవి వెంకటరమణ, మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ నూతన సీయస్ ఆదిత్యనాధ్, జస్టిస్ సీవీ. నాగార్జున్ రెడ్డి, తెలంగాణ మంత్రులు హరీష్ రావ్, మల్లారెడ్డి తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు.
అందంగా ముస్తాబైన హైదరాబాద్ ఆలయాలు
ముక్కోటి ఏకాదశి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. ముక్కోటి ఏకాదశి అనేది.. కోటి ఏకాదశులతో సమానమని భక్తుల నమ్మకం. ఈ రోజు ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శనం చేసుకుంటే మహా పుణ్యం అని భక్తులు విశ్వసిస్తారు. ఉత్తరాయన ఏకాదశి రోజు స్వామి వారు భక్తులకు అనుగ్రహం ఇస్తారని నమ్మకం. స్వామి వారికి మూల విరాట్ అభిషేకం జరిగే శుక్రవారం రోజున.. ముక్కోటి ఏకాదశి రావడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
For More News..
నిప్పంటించుకున్న మహిళ.. కాపాడబోయిన సీఐకి మంటలు
యువతులతో పోలీసుల మిస్ బిహేవ్.. పట్టుకున్న స్టూడెంట్స్
అనాథను చదివించిన హరీష్ రావు.. పెండ్లి కూడా చేసిండు
