అలీబాబా తరహాలో ఏర్పాటు
ఇందుకు రిలయన్స్ బోర్డు గ్రీన్సిగ్నల్
ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీగా చైనాకు చెందిన అలీఎక్స్‌ప్రెస్‌కు పేరుంది. ఇటువంటి భారీ ఇంటర్నెట్ షాపింగ్ కంపెనీని ఏర్పాటు చేయాలన్నది బిలియనీర్ ముకేశ్ అంబానీ కల. ఆయన స్వప్నం త్వరలోనే సాకారం కానుంది. ఇండియాలో ఇంటర్నెట్ షాపింగ్ రంగంలో నంబర్‌వన్‌గా నిలవాలనే టార్గెట్‌తో ఆయన భారీ డిజిటల్ సర్వీస్ కంపెనీ ఏర్పాటుకు అడుగులు వేస్తున్నారు. ఈ హోల్డింగ్ కంపెనీ వాల్యూయేషన్‌ను 24 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.1.70 లక్షల కోట్లు) చేర్చాలనేదే టార్గెట్. అంబానీ కంపెనీ రిలయన్స్ డైరెక్టర్ల బోర్డు ఈ సబ్సిడరీ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. దీనికి 15 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.06 లక్షల కోట్లు) కేటాయించేందుకు కూడా ఒప్పుకుంది.
ఈ మొత్తాన్ని మొదట రిలయన్స్ టెల్కో కంపెనీ జియోలోకి మళ్లిస్తారు. ఇప్పటికే రూ.65 వేల కోట్ల క్యాపిటల్ ఉన్న జియో వచ్చే మార్చి కల్లా పూర్తిగా అప్పులు లేని కంపెనీగా అవతరిస్తుంది. భవిష్యత్‌లో కంపెనీలను మరింత అభివృద్ధి చేయడానికి, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీలతో పోటీ పడటానికి తన డిజిటల్ సర్వీసుల సంస్థకు భారీ ఇన్వెస్ట్‌మెంట్లు తప్పనిసరని ఆసియా కుబేరుడు అంబానీ భావిస్తున్నారు. ఈ ఆన్‌లైన్ రిటైల్ కంపెనీ నుంచి రిలయన్స్‌కు దాదాపు సగం ఆదాయం రావొచ్చని ఈ ఏడాది ఆగస్టులో జరిగిన ఏజీఎంలో అంబానీ ప్రకటించారు. ప్రస్తుతం రిటైల్ సెగ్మెంట్ నుంచి 32 శాతం ఆదాయం వస్తోంది.
ఐపీఓ కూడా …
ఈ కొత్త కంపెనీకి నిధుల కోసం ఐపీఓ బాట పట్టాలని కూడా రిలయన్స్ అధిపతి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఐదేళ్లలోపు ఐపీఓకు వెళ్లాలనే టార్గెట్‌తో రిలయన్స్ పనిచేస్తోంది. 2016లో మొదలైన రిలయన్స్ జియో 35 కోట్ల మంది కస్టమర్లతో దేశంలోనే రెండో అతిపెద్ద టెలికం కంపెనీగా ఏర్పడింది. బలమైన ఆన్‌లైన్ షాపింగ్ కంపెనీని తయారు చేయడానికి కంపెనీలను విలీనం చేసుకొని, వాటాలు కొని జియోకు అనుసంధానిస్తామని రిలయన్స్ తెలిపింది. ఈ–కామర్స్ కంపెనీతో రిలయన్స్ షేర్ హోల్డర్ల సంపద పెరుగుతుందని ఏజీఎంలో అంబానీ ప్రకటించారు. అలీబాబా, అల్ఫాబెట్ మాదిరిగానే రిలయన్స్ కూడా హోల్డింగ్ కంపెనీల్లో ఆప్షనల్లీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ల ద్వారా ఇన్వెస్ట్ చేయనుంది. ఈ యూనిట్‌కు జియో నుంచి రూ.65 వేల కోట్లు వస్తాయని రిలయన్స్ వర్గాలు తెలిపాయి. ఈక్విటీ ఇన్‌ఫ్యూజన్ తరువాత జియో తన 1.08 లక్షల కోట్ల అప్పులను పేరెంట్ కంపెనీ సబ్సిడరీకి బదలాయిస్తుంది.
