పవన్ సినిమాల్లో హీరో, నేను రాజకీయాల్లో హీరో - ముద్రగడ 

కాపు ఉద్యమ నేత ముద్రగడ వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. తన కుమారుడితో కలిసి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బేషరతుగానే వైసీపీలో చేరానని, తమ కుటుంబానికి ఘనమైన చరిత్ర ఉందని అన్నారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాస్తున్నారని అన్నారు ముద్రగడ.తాను ఏ ఉద్యమం చేసినా దళితులు, బీసీలే ముందుండి నడిచారని అన్నారు. చంద్రబాబు కాపు జాతిని అవమానించినపుడు పవన్ ఎందుకు ప్రశ్నించలేదని, బాబు ఐదేళ్ల పాలనలో పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు.

ముద్రగడ వైసీపీలో చేరతారని వార్తలొచ్చినప్పటి నుండి ఆయన పిఠాపురం బరిలో దింపుతారని ప్రచారం జరిగింది కానీ, తనకు పోటీ చేసే అవకాశం దక్కకపోయినా, జగన్ ను మళ్ళీ సీఎం చేయటం కోసమే పార్టీలో చేరానని స్పష్టం చేశారు ముద్రగడ. ఇటీవల మాజీ మంత్రి హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలో చేరటం, ఇప్పుడు ముద్రగడ కూడా చేరటంతో ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపి బలం పెరిగిందనే చెప్పాలి.

పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో జగన్ ఆ స్థానం మీద ప్రత్యేక దృష్టి పెట్టాడని టాక్ వినిపిస్తోంది. పిఠాపురం నుండి వంగా గీతాను బరిలో దింపాలని డిసైడ్ అయ్యాడు జగన్. అంతేకాకుండా ముద్రగడకు కూడా పిఠాపురం బాధ్యతలు అప్పగించారు జగన్. మరి, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వైసీపీలోకి ముద్రగడ చేరిక ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.