వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం.. సీఎం జగన్ సమక్షంలో.. డేట్ ఫిక్స్

వైసీపీలో చేరికపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) అధికారికంగా ప్రకటన చేశారు. ఈనెల 14వ తేదీన  సీఎం జగన్ (YS Jagan) సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని  తెలిపారు. తన కుమారుడు కూడా పార్టీలో చేరుతారని వెల్లడించారు. ఎలాంటి షరతులు లేకుండానే వైసీపీలో చేరుతున్నట్లు స్పష్టం  చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కానీ, కుమారుడు కానీ పోటీపై ఎలాంటి కండిషన్లు పెట్టలేదన్నారు.ఎలాంటి పదవులు కూడా ఆశించడం లేదని… ప్రజలకు సేవ చేయటమే తన లక్ష్యమన్నారు.  వైఎస్ జగన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని వెల్లడించారు.

మరిన్ని సంక్షేమ పథకాలు రావాలనే ఉద్దేశ్యంతో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని ముద్రగడ తెలిపారు.  మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా పదవి ఇస్తే తీసుకోవటానికి సముఖంగా ఉన్నానని తెలిపారు వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు నా వంతు కృషి చేస్తానని సీఎం జగన్ కు చెప్పానని వెల్లడించారు.

 రాజకీయ ప్రస్తానం....

కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham) నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రత్తిపాడు నియోజక వర్గం నుంచి ముద్రగడ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1978, 1983, 1985,1989 ఎన్నికల్లో ఎమ్మల్యేగా గెలిచారు. 1978లో జనతా పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ముద్రగడ, 1983, 1985లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. 1989లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందారు. 1994లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రత్తిపాడు నియోజక వర్గం లో ముద్రగడ కుటుంబం ఆరుసార్లు గెలుపొందింది. పద్మనాభం ఓసారి ఎంపీగా కూడా గెలిచారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు.

also read : ఏపీ గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు విడుదల

1994లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన ఓడిపోయిన ముద్రగడ 1999లో టీడీపీ తరపున ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున పిఠాపురంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి క్రియా‎శీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాపు రిజర్వేషన్ల కోసం టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఉద్యమించారు.ఆ తర్వాత కాలంలో ఆయన ఏదొక రాజకీయ పార్టీలో చేరుతారని పలు సందర్బాల్లో ప్రచారం జరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.