- తాజ్ హోటల్‌కు రూ.5.5 లక్షలు ఎగవేత
- ఇండియన్ క్రికెటర్ పంత్‌కు కోటికి పైగా టోకరా
న్యూఢిల్లీ: లగ్జరీ లైఫ్ స్టయిల్‌కు అలవాటు పడిన ఓ యువ మాజీ క్రికెటర్ అడ్డదారులు తొక్కి.. కటకటాల పాలయ్యాడు. ఐపీఎస్ అధికారినంటూ, రంజీ ప్లేయర్ అంటూ, ఐపీఎల్ ఆటగాడినంటూ లగ్జరీ హోటళ్లకు టోకరా వేశాడు. క్రికెటర్ రిషబ్ పంత్‌ను కూడా మోసం చేసిన నిందితుడు విదేశాలకు పారిపోతుండగా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్టయ్యాడు. హర్యానాలోని ఫరిదాబాద్‌కు చెందిన 25 ఏండ్ల మృణాంక్ సింగ్.. గతంలో అండర్ 19 జట్టుకు ఆడాడు.
ఆ తర్వాత ఆటకు టాటా చెప్పి మోసాల బాట పట్టాడు. తాను ఫేమస్ క్రికెటర్‌ను అంటూ, ఐపీఎల్ జట్టుకు ఆడానంటూ ఢిల్లీలోని తాజ్ హోటల్‌కు రూ.5.5 లక్షలు మోసం చేశాడు. జులై 22 నుంచి 29 వరకు తాజ్ హోటల్‌లో ఉండి, బిల్లు కట్టకుండా వెళ్లిపోయాడు. హోటల్ ఖాళీ చేసేటప్పుడు సిబ్బంది రూ.5.5 లక్షల బిల్లు గురించి అడగగా, తాను ఫేమస్ క్రికెటర్‌నని, తన స్పానర్స్ బిల్లు కడతారంటూ అక్కడి నుంచి జారుకున్నాడు.
ఆ తర్వాత ఎవ్వరి దగ్గరి నుంచి డబ్బులు రాకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో గతేడాది ఢిల్లీ పోలీసులు అతడిపై చీటింగ్ కేసు నమోదు చేసి, లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. మృణాల్ ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేయగా, అప్పటికే అక్కడి నుంచి పరారయ్యాడు. డిసెంబర్ 25న దుబాయ్‌కు పారిపోతుండగా, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకున్నారు.
అప్పుడు కూడా తాను సీనియర్ ఐపీఎస్ అధికారినంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు. మృణాంక్‌కు అదుపులోకి తీసుకున్న ఎయిర్‌పోర్ట్ అధికారులు.. ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. అతన్ని కస్టడీలోకి తీసుకొని విచారించగా, పలు మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు. కర్నాటక ఏడీజీపీ అధికారినంటూ పలు హోటళ్లు, రిసార్ట్‌లను మృణాంక్ మోసం చేశాడు. అంతేకాకుండా లగ్జరీ ఉత్పత్తులను తక్కువ ధరకే విక్రయిస్తానంటూ 2020–21 మధ్య ఇండియన్ క్రికెటర్ రిషబ్ పంత్ నుంచి దాదాపు కోటి రూపాయలకు పైగా కొట్టేశాడు. గతేడాది రిషబ్ పంత్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
