భర్తను కోటిన్నరకు అమ్మేసిన భార్య

భర్తను కోటిన్నరకు అమ్మేసిన భార్య
డ‌బ్బు మీద అత్యాశ‌తో ఓ మ‌హిళ త‌న భ‌ర్త‌ను మ‌రో మ‌హిళకు కోటి రూపాయ‌ల‌కు అమ్మి వేసిన క‌థ‌ను ‘శుభ‌ల‌గ్నం’ సినిమాలో చూశాం. ఇలాంటి ఓ య‌థార్ధ  సంఘ‌ట‌నే మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జ‌రిగింది. కాక‌పోతే కాస్త స్టోరీ వేరు. త‌న భ‌ర్త ప‌రాయి మ‌హిళ మోజులో ప‌డి తనను, తన పిల్లలను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆ మహిళ నుంచి రూ.1.5 కోట్లు డిమాండ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఒక బాలిక…తన తండ్రి అతని ఆఫీసులో పనిచేసే ఒక మహిళతో సంబంధం పెట్టుకున్నాడ‌ని.. త‌మ‌తో కార‌ణం లేకుండా ఇంట్లో గొడవ పడుతున్నాడని, దీంతో ప్రశాంతత లేకుండా పోయిందని ఫ్యామిలీ కోర్టుకు ఫిర్యాదు చేసింది. ఆ గొడవలతో ఇంట్లో తాను..తన చెల్లెలు చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నామని ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు.. ఆ దంప‌తులిద్ద‌ర్నీ కౌన్సెలింగ్ సెంటర్‌కు పిలిపించగా… అతను భార్యతో కాకుండా ఆ మహిళతోనే ఉండాలనుకుంటున్నట్లు, భార్య నుంచి విడాకులు కోరుకుంటున్న‌ట్లు తేల్చి చెప్పాడు. దీనికి అతని భార్య ఒప్పుకోలేదు. తన భర్తను ఆ మ‌హిళ‌కు అప్పగించాలంటే సదరు ప్రియురాలు తనకు రూ. 1.5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అప్పుడే తన భర్తను ఆమెకు అప్పగిస్తానని స్పష్టం చేసింది. ఈ  డీల్ కు  ఓకే చెప్పిన భర్త ప్రియురాలు..  తన ఖరీదైన అపార్ట్‌మెంట్‌ తో పాటు, రూ .27 లక్షల నగదును ఆమెకు అప్పగించింది.  అయితే పెళ్లి అయి ఇన్నాళ్ల తర్వాత మరో మహిళ మోజులో పడి.. తమను వద్దని నిర్ణయించుకున్న వ్యక్తితో కలిసి బ్రతకడం అర్థం లేదని,  తన ఇద్దరు కుమార్తెల భవిష్యత్తు కోసమే ఆ డబ్బు డిమాండ్ చేసినట్లుగా ఆమె తెలిపింది.