హైదరాబాద్: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, గడ్డం కాకా వెంకటస్వామి మంచి స్నేహితులని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ అన్నారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఎంపీ వంశీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడటంతో పాటు కాకా వెంటకస్వామి, మన్మోహన్ సింగ్ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు వంశీ.
మన్మోహన్ సింగ్ మృతి భారత దేశానికి తీరని లోటు అని అన్నారు. ఆర్థిక మంత్రిగా ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు, ప్రధానిగా ఆయన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. కాకా వెంకటస్వామి, మన్మోహన్ సింగ్ మంచి మిత్రులని.. రాజకీయాలకు అతీతంగా వారిద్దరి మధ్య స్నేహం ఉండేదని గుర్తు చేశారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు.
కాగా, గురువారం (డిసెంబర్ 26) భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. దేశ ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ ఆర్థిక వేత్త, డైనమిక్ లీడర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Also Read : దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసిన గొప్ప వ్యక్తి
మన్మోహన్ సింగ్ భౌతికాయాన్ని సందర్శనార్థం ఢిల్లీలోని ఆయన నివాసానికి తరలించారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న మన్మోహన్ సింగ్ కుమార్తె ఇవాళ (డిసెంబర్ 27) తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత.. 2024, డిసెంబర్ 28న అంత్యక్రియలు జరగనున్నాయి. అధికారిక లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మన్మోహన్ మృతికి నివాళిగా వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించింది.