జహీరాబాద్, వెలుగు: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ సీఎం రేవంత్ రెడ్డి అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ అన్నారు. సోమవారం పట్టణంలోని ఎస్ వీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. అంతకుముందు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి చంద్రశేఖర్ తో కలిసి సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా కేక్కట్చేసి అన్నదానం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని, దశాబ్దాల ఉద్యమ కల నెరవేర్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీకి నష్టం జరిగినప్పటికీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మానిక్ రావు, రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహులు, మండల అధ్యక్షుడు మక్సుద్, నరసింహా రెడ్డి పాల్గొన్నారు.