హైవేతో రైతులు నష్టపోకుండా చూడాలి : ఎంపీ రఘునందన్ రావు

  •  ప్రతిపాదిత హైవే నిర్మాణానికి ప్రత్యామ్నాయ రూట్లను పరిశీలించాలి

సిద్దిపేట టౌన్, వెలుగు:  సూర్యాపేట –- సిరిసిల్ల జాతీయ రహదారి 365 బీ ప్రతిపాదిత రూట్ పై రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా.. అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సూచించారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్ లో రైతులు, నేషనల్ హైవే అధికారులతో సమావేశం నిర్వహించారు. ముందుగా హైవే డీపీఆర్ ను తయారు చేసిన ఏజెన్సీ ప్రతినిధి మురళి ప్రొజెక్టర్ ద్వారా దుద్దెడ నుంచి సిరిసిల్ల వరకు రూట్ మ్యాప్ ను చూపించి వివరించారు. 

అనంతరం ఎంపీ మాట్లాడుతూ దుద్దెడ నుంచి రామంచ వరకు గ్రామాల మీదుగా వెళ్తుండగా రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. దుద్దెడ నుంచి రాజీవ్ రహదారి మీదుగా సిద్దిపేట బ్లాక్ ఆఫీస్ చౌరస్తా వరకు జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తూ 756 డీజీ కలపడం, లేదంటే వెలికట్ట నుంచి బందారం మీదుగా సిద్దిపేట రీజినల్ రింగ్ రోడ్డు మీదుగా రామంచ వరకు, దుద్దెడ నుంచి తుక్కాపూర్, ఘన్​పూర్ మీదుగా ఇర్కోడ్ వరకు, అక్కడ నుంచి 765 రోడ్డుతో కలిసి రామంచ వరకు ఆయా రూట్లను  పరిశీలించాలని నేషనల్ హైవే అధికారులకు సూచించారు. 

ప్రతిపాదిత మార్గాల్లో  ఏ రూట్ రైతులకు అనుకూలంగా ఉంటుందో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు.  ఈ సమావేశంలో కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, సిద్దిపేట ఆర్డీవో సదానందం, నేషనల్ హైవే ఈఈ బలరామకృష్ణ, రైతులు పాల్గొన్నారు.