రెండు అంబులెన్స్ లు​ డొనేట్ చేస్తా : ఎంపీ రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు: తన లోక్​సభ పదవీ కాలం పూర్తయ్యేలోపు మరో రెండు అంబులెన్స్​లను దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి డొనేట్​చేస్తానని ఎంపీ రఘునందన్​రావు హామీ ఇచ్చారు. సోమవారం దుబ్బాక ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ .. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాను త్వరలోనే తీసుకొచ్చి ఆస్పత్రిలో నెలకొన్న వైద్యుల కొరత, సిబ్బంది, సమస్యలను వివరిస్తానని చెప్పారు. 

ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల నేపథ్యంలో తాను డొనేట్​ చేసిన అంబులెన్స్​పై తన ఫొటోను అధికారులు తొలగించారని, అంబులెన్స్​పై తన ఫొటో స్టిక్కర్​ను అతికించాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఆస్పత్రిలోని సమస్యలు, వైద్య సిబ్బంది కొరత, ప్రతి రోజు ఎంతమంది వైద్య సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు.

 సాధారణ, సిజేరియన్​ ప్రసవాలు ఎన్ని, డయాలసిస్​ సేవలు ఎంత మంది సద్వినియోగం చేసుకుంటున్నారని సూపరింటెండెంట్​హేమ్​రాజ్​ సింగ్​ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్​ సభ్యుడు బాలేశ్​గౌడ్, అసెంబ్లీ కన్వీనర్​చారీ, కౌన్సిలర్​ మల్లారెడ్డి, పట్టణ అధ్యక్షుడు సుభాష్​ రెడ్డి, నాయకులు వెంకట్, ప్రవీణ్​, రమేశ్​ రెడ్డి, నేహాల్​గౌడ్​పాల్గొన్నారు. 

వాళ్లు దేశంలో ఉండడం అవసరమా..?

సిద్దిపేట: జాతీయ జెండాను గౌరవించని వాళ్లు దేశంలో ఉండడం అవసరమా అని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని హైస్కూల్​ నుంచి బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దినేశ్ అధ్వర్యంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించగా ఎంపీ ముఖ్యఅతిథిగా పాల్గొని స్టూడెంట్స్ కలసి తిరిగారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు అవుతున్నందున ప్రతి వ్యక్తి తన ఇంటి పై జాతీయ జెండా ఎగుర వేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారన్నారు. 

ఎవరైతే జాతీయ జెండా ఎగురవేయనంటారో, పార్లమెంటు లో వేరే దేశం నినాదాలు చేస్తారో అలాంటి వాళ్లని ఈ దేశంలో పోటీ చేయకుండా చట్టం తేవాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, రామచంద్ర రావు, రామచంద్ర రెడ్డి, విద్యాసాగర్, విభీషణ్ రెడ్డి, నరేశ్, మార్కండేయులు పాల్గొన్నారు.