జాబ్ అప్లికేషన్లపైనా 18% జీఎస్టీ సిగ్గుచేటు: కేంద్రంపై ప్రియాంక ఫైర్

న్యూఢిల్లీ, వెలుగు: యువతకు ఉద్యోగాలివ్వడం చేతకాని కేంద్రంలోని మోదీ సర్కార్.. జాబ్ అప్లికేషన్ పత్రాలపైనా జీఎస్టీ వసూలు చేస్తున్నదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శించారు. అగ్నివీర్‎తో సహా జాబ్ అప్లికేషన్లపైనా 18% జీఎస్టీ వసూలు చేస్తున్నదని ఫైర్ అయ్యారు. ఎంతోకాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూసి, ఫీజులు కట్టి పరీక్షలు రాస్తే, చివరికి పేపర్ లీకేజీలతో అవినీతికి పాల్పడుతున్నదని మండిపడ్డారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చమటోడ్చి తమ పిల్లలను చదివిస్తున్నారని, పరీక్షలకు సిద్ధం చేస్తున్నారని, కానీ బీజేపీ ప్రభుత్వం వారి కలలను కల్లలు చేస్తున్నదని ఆరోపించారు.  కేంద్రం పేదల ఆశలను పెట్టుబడిగా మార్చుకుంటున్నదని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు.