ప్లాన్ ప్రకారమే లగచర్లలో బీఆర్ఎస్ దాడి:ఎంపీ మల్లు రవి

  • నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి 
  • వికారాబాద్, లగచర్ల, రోటిబండ తండాల్లో కాంగ్రెస్ నేతలు పర్యటన 

వికారాబాద్ / కొడంగల్ వెలుగు : ఇండస్ట్రియల్ కారిడార్​ భూ సేకరణకు వెళ్లిన వికారాబాద్ కలెక్టర్, అధికారులపై లగచర్లలో బీఆర్ఎస్ ప్లాన్ ప్రకారం దాడి చేయించిందని, దీని వెనక కేటీఆర్ కుట్ర ఉందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. లగచర్లలో అధికారులపై దాడి ఘటన వివరాలు తెలుసుకునేందుకు రాష్ట్ర రైతు కమిషన్ ​చైర్మన్​ కోదండరెడ్డి, రాష్ట్ర గిరిజన డెవలప్ మెంట్ ఫైనాన్స్  కార్పొరేషన్  చైర్మన్ బెల్లయ్య నాయక్​తో  కలిసి బుధవారం వికారాబాద్​లో పర్యటించారు. 

కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్, ఎస్పీ నారాయణ రెడ్డిని కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు.  అనంతరం ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ లగచర్ల ఘటన విషయమై అసలు వాస్తవాలు తెలుసుకుని ప్రజలు, ప్రభుత్వం ముందు ఉంచుతామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ అభివృద్ధి కోసం దాదాపు 4,500 కోట్లు కేటాయించారని, అందులో భాగంగానే పరిశ్రమలు స్థాపిస్తున్నట్టు తెలిపారు. లగచర్ల ఘటనపై ప్రజలను తప్పుదోవ పట్టించి బీఆర్ ఎస్ నేతలు ఢిల్లీలో రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా ఉన్నారని బీజేపీ, బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్​ను హత్య చేసేందుకే బీఆర్ఎస్​ కుట్ర చేసిందని కోదండరెడ్డి, బెల్లయ్య నాయక్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్​రెడ్డి ఆరోపించారు. అనంతరం  లగచర్లకు వెళ్లిన వారు రైతులను ఏం జరిగిందని అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు సమాధానాలు ఇస్తూ దాడి చేసింది తాము కాదని, పరిహారం గురించి తమకు ఎవరూ స్పష్టత ఇవ్వలేదన్నారు. 

కొడంగల్ ​ప్రజలు అప్రమత్తతతో ఉండాలని, బీఆర్ఎస్​ లీడర్లు చెప్పే మాటలు వింటే నష్టపోతారని కాంగ్రెస్​ నేతలు రైతులకు సూచించారు.  టీపీసీసీ కార్యదర్శి రాములు ఉన్నారు.