సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

  • గనుల వేలానికి వ్యతిరేకంగా పోరాడ్తం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ   
  • కొత్త గనులు రాకపోతే సంస్థ మనుగడ కష్టం
  • రాష్ట్రంలోని గనులన్నీ సింగరేణికే కేటాయించాలని డిమాండ్

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు. బొగ్గు గనుల వేలం జాబితాలో సింగరేణి ప్రాంతానికి చెందిన శ్రావణపల్లి మైన్​ను చేర్చడంపై ఆయన ఫైర్ అయ్యారు. గనుల వేలాన్ని అడ్డుకుని, సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. ఈ మేరకు వంశీకృష్ణ శుక్రవారం వీడియో మెసేజ్ విడుదల చేశారు.

కార్మికులు భయపడినట్టే కేంద్రంలోని బీజేపీ సర్కార్​60 బొగ్గు గనులను వేలానికి పెట్టిందని మండిపడ్డారు. ఇందులో శ్రావణపల్లి బొగ్గు గని ఉందని చెప్పారు. త్వరలోనే మణుగూరులోని ప్రకాశం ఖని ఓపెన్​కాస్ట్​2, ఇల్లందు కోయగూడెం ఓసీపీ3ని కూడా వేలం వేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. ‘‘గత బీఆర్ఎస్ ​సర్కార్​ సింగరేణిని సర్వనాశనం చేసింది.

కేంద్రం తెచ్చిన మైన్స్ అండ్​మినరల్స్ యాక్ట్​కు ఆనాడు బీఆర్ఎస్ ఎంపీలు మద్దతు ఇచ్చారు. వేలంలో సింగరేణి పాల్గొనకుండా అడ్డుకున్నారు. ఫలితంగానే సత్తుపల్లి, కొయగూడెం ఓసీపీలు ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లాయి. కోయగూడెం ఓసీపీని తనకు అనుకూలమైన అరబిందో ఫార్మా గ్రూపుకు బీఆర్ఎస్ అప్పగించింది” అని మండిపడ్డారు. 

కేంద్రం తీరుతో అదానీ, అంబానీలకే లాభం.. 

సింగరేణికి కొత్త గనులు రాకపోవడంతో బొగ్గు ఉత్పత్తి పెరగడం లేదని, కొత్త ఉద్యోగాలు రావడం లేదని వంశీకృష్ణ అన్నారు. అందుకే గనుల వేలానికి వ్యతిరేకంగా కాంగ్రెస్​ సర్కార్ పోరాడుతున్నదని చెప్పారు. ‘‘సింగరేణి సంస్థకు నేరుగా బొగ్గు బ్లాక్​లు కేటాయించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కేంద్రం పట్టించుకోలేదు. పదేండ్లలో బీజేపీ సర్కార్ ఎన్నో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేసింది.

ఇప్పుడు వాళ్ల కన్ను సింగరేణిపై పడ్డది. బీజేపీ సర్కార్ కు వేలం ద్వారా వచ్చే పైసలు, కమీషన్లు తప్ప కార్మికుల సంక్షేమం పట్టదు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వేలంలో పాల్గొనేలా కొత్త రూల్స్​తీసుకొచ్చారు. దీని వల్ల అదానీ, అంబానీ వంటి కంపెనీలకే ప్రయోజనం కలుగుతుంది” అని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికే చెందిన కేంద్రమంత్రి కిషన్​రెడ్డి బొగ్గు గనుల వేలాన్ని ప్రోత్సాహిస్తున్నారని మండిపడ్డారు.

ప్రైవేటైజేషన్​వల్ల ఉద్యోగాలు తగ్గుతాయని అన్నారు. ‘‘ప్రైవేట్ కంపెనీలు కేవలం లాభాల కోసమే పని చేస్తాయి. వాటికి కార్మికుల సంక్షేమం పట్టదు. కానీ పబ్లిక్ సంస్థలు కార్మికుల ప్రయోజనాలు, ప్రజల బాగోగుల కోసం పని చేస్తాయి. రూ.30 వేల కోట్ల బకాయిలున్న సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనడం కష్టం. కేంద్రం సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని ఉపసంహరించుకోవాలి. తెలంగాణలోని అన్ని గనులను సింగరేణికే కేటాయించాలి” అని డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ మనుగడ కోసం పోరాడతామని, కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.