పదేండ్లుగా దిశా మీటింగులు పెట్టరా : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

  • ఇకపై ప్రతీ మూడునెలలకోసారి మీటింగ్
  • ఎన్​హెచ్ఎం నిధులను సమర్థంగా వినియోగించాలి
  • కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో సమీక్ష

పెద్దపల్లి/ లక్సెట్టిపేట వెలుగు:  గత పదేండ్లలో దిశ మీటింగ్ ఒకే ఒక్కసారి జరుగడం దురదృష్టకరమని, ఇకపై ప్రతీ మూడు నెలలకోసారి నిర్వహిస్తామని పెద్దపల్లి జిల్లా దిశ కమిటీ చైర్మన్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, నేషనల్ హెల్త్ మిషన్(ఎన్​హెచ్ఎం)​ నిధులను సమర్థంగా వినియోగించుకోవాలని తెలిపారు. పెద్దపల్లి కలెక్టరేట్ లో గురువారం డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్, కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ (దిశ) కమిటీ మీటింగ్ ఎంపీ అధ్యక్షతన నిర్వహించారు. 

ఈ సందర్భంగా పలు శాఖల పనితీరు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించారు. విద్య, వైద్యం, కరెంటు, మంచినీరు, రైతుల సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. స్కూళ్లలో మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచాలని, డీఈఓలు తరుచూ తనిఖీలు చేయలన్నారు. 

జిల్లాలో ఉన్న 542 ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పన కోసం సమగ్ర శిక్ష అభియాన్ నిధులతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద జిల్లాలో చేపట్టిన రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులు త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలన్నారు. హెల్త్ సబ్ సెంటర్ల పనులు త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. పవర్ కట్స్ లేకుండా చర్యలు తీసుకోవాలని ఎస్ఈని ఆదేశించారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో అన్ని రంగాల అభివృద్ధికి దిశ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దీన్ని రెగ్యులర్​గా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పథకాలు జిల్లాలో సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్లు అరుణశ్రీ, వేణు, వివిధ శాఖల అధికారులు కమిటీ సభ్యులు సజ్జాద్​ తదితరులు పాల్గొన్నారు.

చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే భవిష్యత్
 
క్రమశిక్షణతో చదువుకుంటూ క్రీడల్లో కూడా రాణిస్తే విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని వంశీకృష్ణ అన్నారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలోని గురుకుల బాలికల విద్యాలయంలో నాలుగు రోజులుగా జరిగిన జోనల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు ప్రతి ఒక్కరికి చాలా అవసరమని దీని ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు ఆరోగ్యకరమైన జీవనం ఉంటుందన్నారు. 

కుల మతాలకతీతంగా మతసామరస్యాన్ని చాటి చెప్పేవి క్రీడలని క్రీడల్లో కులం మతం ఏమి ఉండావని అందరూ సమానంగా ఉండేది క్రీడల్లో నేనని అన్నారు.  గురుకుల బాలికల స్కూళ్లో కొన్ని రిక్వైర్మెంట్స్ అవసరమని ప్రిన్సిపల్ తన దృష్టికి తీసుకువచ్చారని వాటి పరిష్కారం కోసం సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణను స్కూల్​ ​ప్రిన్సిపల్ రమా కల్యాణి, సిబ్బంది ఘనంగా సన్మానించారు. అంతకు ముందుగా స్పోర్ట్స్ మీట్ విజేతలకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి బహుమతులు అందజేశారు.