జోగులాంబ అమ్మవారికి ఎంపీ డీకే అరుణ పూజలు

అలంపూర్,వెలుగు: జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని మహబూబ్​నగర్  ఎంపీ డీకే అరుణ తెలిపారు. శుక్రవారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను ఎంపీ దర్శించుకున్నారు. ఆలయ ఈవో పురేందర్ కుమార్, ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. గణపతి పూజ అనంతరం స్వామి వారిని దర్శించుకుని అభిషేకం నిర్వహించారు.

అమ్మవారిని దర్శించుకొని కుంకుమార్చన, చండీహోమం నిర్వహించారు.ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అమ్మవారి దయతో సమృద్ధిగా వర్షాలు పడ్డాయన్నారు. కేంద్ర ప్రభుత్వం అలంపూర్ ఆలయ అభివృద్ధికి ప్రసాద్  స్కీం కింద రూ.72 కోట్లు మంజూరు చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డిఆలయాల అభివృద్ధిపై చొరవ తీసుకోవాలని కోరారు. అనంతరం కొత్తగా ఎన్నికైన ఆలయ కమిటీ చైర్మన్  నాగేశ్వర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.