ట్రిపుల్ ఆర్ మొత్తం ఖర్చే రూ.7 వేల కోట్లు : ఎంపీ చామల

హైదరాబాద్, వెలుగు: ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు మొత్తం ఖర్చే రూ. 7 వేల కోట్లు అని, అలాంటప్పుడు అందులో రూ. 12 వేల కోట్ల అవినీతి జరిగిందని కేటీఆర్ మాట్లాడడం ఏమిటని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. కేటీఆర్ ను అరెస్టు భయం వెంటాడుతున్నదని ఎద్దేవా చేశారు. ఫార్ములా ఈ రేసుపై కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నాడని ఆరోపించారు. 

కేటీఆర్ తప్పు చేయకపోతే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఆలోచన కాంగ్రెస్ కు లేదన్నారు. ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రతిపక్షం హెచ్చరించాలని, కానీ రాజకీయం కోసం మాట్లాడటం కరెక్ట్ కాదని తెలిపారు. కేటీఆర్, కవిత, హరీశ్ లు ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో రైతు బంధు పథకం కింద అనర్హులను లబ్దిదారులుగా చేర్చారని ఆరోపించారు. దానివల్ల రూ. 22 వేల కోట్ల  అవినీతి జరిగిందన్నారు. అల్లు అర్జున్ అరెస్టుతో రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారని చామల పేర్కొన్నారు.