అరెస్ట్ కావాలని కేటీఆర్‎కు చాలా ఇంట్రెస్ట్: ఎంపీ చామల

హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్‎కు రంగం సిద్ధమైందని.. మరో రెండు, మూడు రోజుల్లో పోలీసులు ఆయనను అరెస్ట్ చేస్తారని తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‎లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కేటీఆర్ అరెస్ట్‎పై అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు అరెస్టు చేస్తారని కేటీఆర్ ఎదురు చూస్తున్నాడు.. ఆయనకు అరెస్టు కావాలనే ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా ఉందని అన్నారు. 

ప్రతి సారి ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నాడు..  ప్రతి విషయంలో గవర్నమెంట్‎కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. గవర్నమెంట్ మీద విష ప్రచారం చేస్తూ కేసులు పెట్టించుకోవాలనే భావనలో ఆయన ఉన్నారని.. అరెస్టయి ట్రెండింగ్‎లోకి రావాలని కేటీఆర్ భావిస్తున్నట్టు ఉన్నాడన్నారు. ఎవరైనా సరే చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.