కేసీఆర్ ఫ్యామిలీలో జైలుకెళ్లేందుకు పోటీ : చామల కిరణ్ కుమార్ రెడ్డి  

  • అరెస్ట్ అయితే ‘పుష్ప’లా మైలేజ్ వస్తుందని కేటీఆర్ అనుకుంటుండు
  • ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి  

న్యూఢిల్లీ, వెలుగు: ఫార్ములా–ఈ రేస్ కేసులో అరెస్ట్ అయితే పుష్ప– 3 రేంజ్ లో మైలేజ్ వస్తదని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అనుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. హీరో అల్లు అర్జున్ అరెస్టు తర్వాత పుష్ప–-2 కలెక్షన్స్ మరో రూ.100–150 కోట్లు పెరిగినట్లు టాక్ వస్తోందని చెప్పారు. దీంతో కేటీఆర్ కూడా అరెస్టు అయితే పుష్ప–3 లెవెల్ లో మైలేజ్ వస్తుందని భావిస్తున్నారని కామెంట్ చేశారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం అరెస్టయితే రేటింగ్ పెరుగుతుందని నేతలు భావిస్తున్నారని సెటైర్ వేశారు.

ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ తరహాలో మరికొన్ని రాష్ట్రాల్లో బీజేపీ వేధింపులతో అరెస్టయిన నేతలకు ప్రజల సానుభూతి లభించిందన్నారు. కానీ తెలంగాణలో కేటీఆర్ కు అలాంటి సానుభూతి రాదన్నారు. ఇక్కడ ఆయనకు వ్యతిరేకంగా ప్రభుత్వం అరెస్టులు చేయడం లేదని.. అవినీతి కేసుల్లో చట్టం తన పని తాను చేస్తుందన్నారు. అరెస్టుల విషయంలో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య పోటీ నెలకొందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత ఆల్రెడీ జైలుకెళ్ళి వచ్చారని, కేటీఆర్ కూడా జైలుకు వెళ్లి వస్తే మైలేజ్ పెరుగుతుందని భావిస్తున్నారన్నారు.  

బీజేపీ నిజ స్వరూపం తెలిసింది: మల్లు రవి

అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన కామెంట్లతో బీజేపీ నిజ స్వరూపం బయటపడిందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. రాజకీయంగా ఓట్ల కోసం మాత్రమే రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గురించి బీజేపీ మాట్లాడుతుందన్నారు. అంతేకానీ రాజ్యాంగం, దళితులపై ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా దళిత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆ వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. షా కామెంట్లపై సభ వెలుపల, సభ లోపల నిరసన తెలియజేసినట్లు చెప్పారు. అయితే, ఈ అంశంపై ఏం సమాధానం చెప్పాలో తెలియక స్పీకర్ ఓం బిర్లా లోక్ సభను వాయిదా వేశారన్నారు.