మాచర్ల- _ గద్వాల రైల్వేలైన్​ సాధిస్తాం : మల్లు రవి

వనపర్తి, వెలుగు :   చాలాకాలంగా పెండింగ్​లో ఉన్న మాచర్ల- జోగులాంబ గద్వాల రైల్వేలైన్​ను సాధించి తీరుతామని నాగర్​కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ  కాంగ్రెస్​ అభ్యర్థి మల్లురవి అన్నారు.  శుక్రవారం ఆయన వనపర్తి నియోజకవర్గంలోని పలు  ప్రాంతాల్లో   ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి  ఎన్నికల  ప్రచారం నిర్వహించారు.   రైల్వేలైన్​ సాధనతో వనపర్తి తో  పాటు వెనుకబడ్డ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని,   గత ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల రైల్వేలైన్​ పనులు పెండింగ్​లో పడ్డాయన్నారు.  

తనను గెలిపిస్తే రైల్వేలైన్​ను సాధించి తీరుతానని హామీ ఇచ్చారు.   ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో అయిదింటిని అమలు చేశామని, బీఆర్​ఎస్​ ప్రభుత్వానికి చరమగీతం పాడినట్లే తాజా పార్లమెంటు ఎన్నికల్లోనూ కేంద్రంలోని బీజేపీని   ఓడించాలని పిలుపునిచ్చారు.  ఈ ప్రచారంలో  డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్​, పార్టీ పట్టణాధ్యక్షుడు చీర్లచందర్​, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.