బీజేపీని విమర్శించే అర్హత లేదు : డీకే అరుణ

నారాయణపేట, వెలుగు : బీజేపీని విమర్శించే అర్హత కాంగ్రెస్​ నేతలకు లేదని ఆ పార్టీ మహబూబ్​నగర్​ ఎంపీ క్యాండిడేట్​ డీకే అరుణ పేర్కొన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం ప్రధాని మోదీ పాల్గొన్న సభలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకుఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో మహబుబ్​నగర్​తో పాటు రాష్ట్రంలో చాలా చోట్ల ఓడిపోతామనే భయంతో సీఎం రేవంత్​రెడ్డి ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారన్నారు.

కనీసం మహిళలనే మర్యాద లేకుండా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సీఎం స్థాయిలో ఉండి మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు మోదీని ప్రధాని చేయాలనే నిర్ణయానికి వచ్చామని చెబుతున్నారని తెలిపారు. మోదీ మరోసారి వస్తే పేదల బతుకులు మారుతాయన్నారు. దేశం చుట్టూ శత్రువులు కన్నెత్తి చూడకుండా చేశారని కొనియాడారు. బీజేపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి రిజర్వేషన్లపై అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. 

ఆకట్టుకున్న మోదీ ప్రసంగం..

ప్రధాని మోదీ తెలుగులో ‘మాతలు, సోదరి, సోదరీమణులారా నాహృదయ పూర్వక నమస్కారం’ అంటూ ప్రసంగం ప్రారంభించారు. స్టేజీ ముందు దివ్యాంగులు ఇబ్బంది పడుతుండడం చూసి, స్వేచ్ఛగా ఉండనివ్వాలని కోరారు. వారి కోసం దాదాపు 2 నిమిషాలు స్పీచ్​ ఆపారు. ఇదిలాఉంటే మోదీ మాట్లాడుతున్నప్పుడు ఓ దివ్యాంగురాలు మోదీ ఫొటోను చూపిస్తుండగా, ఫొటోను తనకు ఇవ్వాలని సెక్యూరిటీ సిబ్బందిని కోరారు. ఫొటోపై పేరు రాస్తే తాను లెటర్​ రాస్తానని చెప్పారు.