కేసీఆర్ వల్లే సింగరేణి దివాలా: బండి సంజయ్

  • సంస్థలో అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? 
  • రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రమంత్రి బండి సంజయ్ సవాల్ 

కరీంనగర్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ వల్లే సింగరేణి దివాలా తీసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తాడిచర్ల బొగ్గు గనిని జెన్ కోకు ఇస్తే, నాటి కేసీఆర్ ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ వాళ్లకు అప్పగించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ మూర్ఖపు ఆలోచనతో సింగరేణిని దెబ్బతీశారని, సొంత కుటుంబానికి ఏటీఎంగా మార్చుకుని దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు.

సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? అని రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కరీంనగర్​లోని మున్సిపల్ గ్రౌండ్​లో నిర్వహించిన కార్యక్రమంలో సంజయ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని రామగుండం పర్యటనలో ప్రధాని మోదీ ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు.

‘‘సింగరేణిలో కేంద్రానిది 49 శాతం వాటా మాత్రమే. రాష్ట్రానికి 51 శాతం వాటా ఉంది. అలాంటప్పడు రాష్ట్ర అనుమతి లేకుండా సింగరేణిని ప్రైవేటీకరించడం ఎలా సాధ్యమవుతుంది” అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం స్వలాభం కోసం సింగరేణిలో అవినీతి చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తున్నదని ఆరోపించారు.

‘‘గత బీఆర్ఎస్ సర్కార్ నయీం కేసు, మియాపూర్ భూములు, డ్రగ్స్, పేపర్ లీకేజీ లాంటి కేసులపై సిట్ వేసి మధ్యలోనే నీరుగార్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అట్లనే చేస్తున్నది. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విచారణ పేరుతో జాప్యం చేస్తూ లాభం పొందాలనుకుంటున్నది” అని అన్నారు. యోగా ఆరోగ్యానికి మంచిదని, అందరూ యోగా చేయాలని సూచించారు.