ఐదుగురు సీఎంలు చేయలేనిది రేవంత్ చేస్తున్నరు..అందరూ మాటల వద్దే ఆగిపోయిన్రు : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

  • రేవంత్ మాత్రమే చేతల్లో చేసి చూపించారని వ్యాఖ్య
  • మెట్రో భూ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓల్డ్ సిటీ మెట్రో విషయంలో ఐదుగురు సీఎంలు చేయలేనిది.. రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఓల్డ్ సిటీ మెట్రో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. చంద్రబాబు హయాం నుంచే ఓల్డ్ సిటీలో మెట్రోపై చర్చ నడిచిందన్నారు. తర్వాత వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా డిస్కస్ జరిగిందే తప్ప ముందుకెళ్ల లేదని తెలిపారు. ఆ తర్వాత కేసీఆర్ ప్రతిపాదనలు సిద్ధం చేసి వెనక్కి తగ్గారన్నారు. ఇలా ఐదుగురు సీఎంలు మాటల వద్దే ఆగిపోయారని, రేవంత్ రెడ్డి మాత్రం చేతల్లో చూపించారని కొనియాడారు. బడ్జెట్​లో రూ.500 కోట్లు కేటాయించడం సంతోషకరమన్నారు.

ఓల్డ్ సిటీ మెట్రో మార్గంలో ఆస్తులు కోల్పోతున్న యజమానులకు సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్​లో నష్టపరిహారం కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి ఎంపీ అసద్ హాజరై మాట్లాడారు. ‘‘34 మందికి 40 చెక్కులు పంపిణీ చేశాం. స్క్వేర్ యార్డుకు 63 వేలు చెల్లించాల్సి ఉండగా.. రేవంత్ చొరవతో రూ.81వేలు ఇవ్వడం అభినందనీయం. పరిహారం చెల్లించిన వారికి ఇండ్లు ఖాళీ చేసేందుకు టైమ్ ఇవ్వాలి’’అని ఎంపీ అసద్ కోరారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట మధ్య 5 స్టేషన్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.

సీఎం ఆదేశాల మేరకు పరిహారం చెల్లింపు: మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి

మెట్రో రైల్ భూ నిర్వాసితులకు సీఎం ఆదేశాల మేరకు నష్టపరిహారం చెల్లిస్తున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఎంపీ అసద్ ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఫేజ్ 1 కన్నా మరిన్ని సౌలత్​లతో ఓల్డ్ సిటీ మెట్రో పూర్తి చేస్తామని తెలిపారు. ఓల్డ్ సిటీ.. న్యూ సిటీగా మారుతుందన్నారు. అవసరమైన చోట స్కైవాక్, ఫుట్​పాత్​లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సీఎం రేవంత్ ఆకాంక్షకు తగ్గినట్టు ఓల్డ్ సిటీ వాసులకు మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

రూ.2,741 కోట్ల అంచనా వ్యయంతో ఏడున్నర కిలో మీటర్లను నాలుగేండ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. 1,100 ఆస్తులకు సుమారు వెయ్యి కోట్ల నష్టపరిహారం చెల్లించనున్నామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.