కేప్ కార్నివాల్: ప్రైవేట్ రాకెట్ తయారీ సంస్థ స్పేస్ ఎక్స్ నలుగురు ఆస్ట్రోనాట్లను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. నాసాతో కలిసి చేపట్టిన ఈ కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్‌కు ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ వేదికైంది. ఆదివారం రాత్రి 7 గంటల 27 నిమిషాలకు ఫాల్కన్ 9 రాకెట్లో ఆస్ట్రొనాట్ల బృందం స్పేస్‌లోకి బయలుదేరింది. 9 నిమిషాల్లో కక్ష్యలోకి చేరుకున్న డ్రాగన్ క్యాప్సుల్‘రెసిలియెన్స్’.. సోమవారం రాత్రికల్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) చేరుకోనుంది. మొత్తంగా ఐఎస్ఎస్ను చేరుకోవడానికి క్యాప్సుల్‌కు ఇరవై ఏడున్నర గంటల టైమ్ పట్టనుంది.
అక్టోబర్‌లోనే క్వారంటైన్లోకి ఆస్ట్రోనాట్లు
స్పేస్ఎక్స్ ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలాన్ మస్క్‌కు కరోనా సోకడంతో దూరం నుంచే ప్రయోగాన్ని చూశారు. రాకెట్ ఫస్ట్ స్టేజ్ తర్వాత మస్క్ రెడ్ హార్ట్ సింబల్‌ను ట్వీట్ చేశారు. వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ వాషింగ్టన్ నుంచి స్పేస్ ఎక్స్ స్టేషన్‌కు చేరుకొని ప్రయోగాన్ని చూశారు. నాసా ప్రయోగంపై ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు. ‘ఏ గ్రేట్ లాంచ్’ అని ట్వీట్ చేశారు. ప్రెసిడెంట్ ఎలెక్ట్ బైడెన్ కూడా నాసా టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ప్రయోగం చూసేందుకు స్పేస్ స్టేషన్ బయట వందలాది మంది గుమిగూడారు. ఆస్ట్రోనాట్లు ఫ్యామిలీలతో కలిసి అక్టోబర్‌లోనే క్వారంటైన్లోకి వెళ్లారు.
ఈసారి ఓ మహిళా ఆస్ట్రోనాట్
ఈసారి ఆస్ట్రోనాట్లలో ఓ మహిళ కూడా ఉంది. నలుగురిలో మైక్ హాప్కిన్స్ ఎయిర్‌ఫోర్స్ కల్నల్ కాగా.. షన్నన్ వాకర్ భౌతిక శాస్త్రవేత్త, విక్టర్ గ్లోవర్ నేవీ కమాండర్, జపాన్‌కు చెందిన సోయ్చి నొగూచి ఉన్నారు. ఈ నలుగురు ఆస్ట్రొనాట్లు 6 నెలల పాటు ఐఎస్ఎస్లో ఉండనున్నారు. కాగా, ఈ డ్రాగన్ క్యాప్సుల్‌ను హైటెక్ ఫీచర్లతో, ఎక్కువ స్పేస్‌తో ఏడుగురు వెళ్లేలా డిజైన్ చేశారు.
ఇక సూయజ్ కాదు.. ఫాల్కన్
నాసా స్పేస్ షటిల్ 2011లో రిటైర్ అయ్యాక స్పేస్ స్టేషన్‌కు కార్గోను, ఆస్ట్రోనాట్లను పంపించడానికి ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడింది. గతంలో రష్యా సూయజ్ రాకెట్ నుంచి తమ ఆస్ట్రొనాట్లను పంపడానికి ఒక్కో సీటుకు రూ. 670 కోట్లకు పైగా నాసా ఖర్చు పెట్టింది.
స్పేస్ ఎక్స్కు రెండోది
స్పేస్ ఎక్స్ ఇప్పటికే ఓసారి ఇద్దరు ఆస్ట్రోనాట్లను అంతరిక్షంలోకి పంపింది. డెమో 2 మిషన్‌లో భాగంగా బాబ్ బెన్కెన్, డాగ్ హార్లేలను ఐఎస్ఎస్కు చేరవేసింది. తాజా ప్రయోగం స్పేస్ఎక్స్కు రెండోది. కాగా, ఈ ప్రయోగంలో వాడిన ఫస్ట్ స్టేజ్ బూస్టర్ ను మళ్లీ లాంచ్ చేయడానికి వీలుగా స్పేస్ ఎక్స్ మార్చనుంది. తాజా ప్రయోగంతో మున్ముందు ఎవరైనా టికెట్ కొనుక్కొని అంతరిక్షంలోకి వెళ్లే చాన్స్ రానుంది.
