నిబంధనలకు విరుద్ధంగా నీళ్ల తరలింపు.. ఏపీకి కేంద్రం షోకాజ్ నోటీసులు

హైదరాబాద్: వాస్తవానికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఔట్ సైడ్ బేసిన్కు ఎట్టి పరిస్థితుల్లోనూ నీటిని తరలించవద్దని నిబంధన లు చెప్తున్నాయి. 1960 సెప్టెంబర్ తర్వాత చేపట్టిన ఏ ప్రాజెక్టు నుంచి కూడా బేసిన్ బయటకు నీటిని తరలించొద్దని కృష్ణా వాటర్ డిస్స్యూట్స్ ట్రిబ్యునల్ (బచాపత్ ట్రిబ్యునల్) ఆవార్డు స్పష్టం చేసింది. కానీ ఏపీ సర్కార్ మాత్రం అందుకు విరుద్ధంగా శ్రీశైలం బేసిన్లోనే లేని రాయలసీమకు నీటిని తరలించుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నది. అంతేగాకుండా పెన్నా బేసిన్లో ఇప్పటికే ఏపీకి 307.6 టీఎంసీల గ్రాస్ స్టోరేజీ అందుబాటులో ఉంది. 

ఒక ఏడాదిలో వచ్చే వరదలు 75 శాతం ఆధారంగా (75% డిసెండ బిలిటీ) చూసుకున్నా 200 టీఎంసీల కన్నా ఎక్కువ నీళ్లే అందుబాటులో ఉంటాయి. వాటి నుంచి ఏపీ డ్రింకింగ్‎కు వాటర్ తరలించుకుపోవచ్చు. కానీ, ఇక్కడ మాత్రం ఏపీ ఉద్దేశపూర్వకంగానే శ్రీశైలం నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా నీటిని మళ్లించుకు పోయేందుకు కుట్ర పన్నుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు డ్రింకింగ్ వాటర్ కోసమే అయినా రోజుకు 3.5 టీఎంసీల అవసరం ఏముంటుందన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.

ఏపీకి కేంద్రం షోకాజ్ నోటీసులు..

జాయింట్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీ సర్కార్‎కు ఈ ఏడాది ఏప్రిల్ 24న కేంద్ర పర్యావరణ శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డీపీఆర్‎ను తయారు చేసేందుకు పనులు చేస్తామని చెప్పి, అంతకు మించి పనులు ఎందుకు చేశారో చెప్పాలని ఆదేశించింది. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద ఇచ్చిన ఈ షోకాజ్ నోటీసుల్లో డీపీఆర్ తయారు చేసేందుకు చేయాల్సిన పనులకూ ఎన్విరాన్మెంటీ క్లియరెన్సులు తప్పనిసరి అని స్పష్టం చేసింది. కానీ, ప్రాజెక్టు విషయంలో ఏపీ నిబంధనలు ఉల్లంఘించిందని తేల్చి చెప్పింది. 

వాస్తవానికి డీపీఆర్ కోసం పనులు చేయాల్సి వస్తే.. ఈఐఏ నోటిఫికేషన్ 2006 ప్రకారం కేవలం ప్రాజెక్ట్ సైట్ చుట్టూ ప్రహరీ నిర్మాణం ఆ ప్రాంతంలో తాత్కాలిక నిర్మాణాలు, తాత్కాలికంగా కరెంట్, నీటి సౌకర్యం కల్పించడం వంటి పనులను మాత్రమే చేపట్టాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ ఏపీ మాత్రం వాటికి మించి పంప్ హౌస్ల కోసం ఎక్కవేషన్ వర్క్స్, టన్నెల్ వర్క్స్, అప్రోచ్ కెనాల్ వర్క్స్‎ను కూడా చకచకా చేసేస్తున్నది.