- ఇంటర్ ఫెయిల్ అయ్యాడని మందలించిన తల్లి
- ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఆత్మహత్య
మోత్కూరు, వెలుగు : కొడుకు ఇంటర్ ఫెయిల్ కావడంతో తల్లి మందలించగా, ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. దీంతో మనస్తాపానికి గురైన తల్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన యాదాద్రి జిల్లా మోత్కూరు పట్టణంలో గురువారం జరిగింది. మోత్కూర్‌కు చెందిన మంచె కుమారస్వామి, రేఖ (38) దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. ఇద్దరూ ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. కొడుకు సరిగా చదవకపోవడం, ఇంటర్ ఫెయిల్ కావడంతో గురువారం తల్లి మందలించింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో తల్లి కొడుకుపై చేయి చేసుకుంది. కొంత సేపటి తర్వాత రేఖ గదిలోకి వెళ్లి ఎంతకూ బయటకు రాలేదు. దీంతో పిల్లలు తండ్రికి విషయం చెప్పడంతో అతడు వచ్చి తలుపు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇంటర్ ఫెయిల్ కావడంతో స్టూడెంట్ ఆత్మహత్య
సుల్తానాబాద్, వెలుగు : ఇంటర్‌లో ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతో స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది. సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామ శివారు మారుతీనగర్‌కు చెందిన కొండిల్ల సదయ్య కుటుంబం సుల్తానాబాద్ పట్టణంలోని పూసాల రోడ్డులో నివసిస్తోంది. సదయ్య కూతురు శ్రీనిధి (17) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. ఇటీవల రిజల్ట్ రాగా శ్రీనిధి ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపానికి గురై ఈ నెల 8న ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల 16న హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ బుధవారం రాత్రి చనిపోయింది. మృతురాలి తల్లి రమ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రావణ్‌కుమార్ తెలిపారు.