యాదగిరిగుట్టకు మదర్ డెయిరీ నెయ్యి సప్లై

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఎప్పటిలాగే మదర్ డెయిరీ 'నెయ్యి' సరఫరా చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందని మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ఫ్లెక్సీలకు డెయిరీ డైరెక్టర్లు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జనవరి ఒకటి నుంచి రాష్ట్రంలో ఎండోమెంట్ పరిధిలోకి వచ్చే అన్ని ఆలయాల్లో ప్రభుత్వ రంగ సంస్థ అయిన 'విజయ డెయిరీ' నెయ్యిని మాత్రమే వాడాలని ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసిందని గుర్తుచేశారు. 

గత 35 ఏండ్లుగా తక్కువ ధరకే యాదగిరిగుట్ట ఆలయానికి మదర్ డెయిరీ నెయ్యిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చొరవ వల్లే యాదగిరిగుట్టకు మదర్ డెయిరీ నెయ్యి సరఫరా అనేది సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, సహకరించిన మంత్రులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మదర్ డెయిరీ డైరెక్టర్లు, యాదగిరిగుట్ట మాజీ ఉప సర్పంచ్ భరత్ గౌడ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ టౌన్ అధ్యక్షుడు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.